Israel – Hamas Deal : అక్టోబరు 7న మొదలైన ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో తొలిసారి ఊరట కలిగించే వార్త ఒకటి బయటికి వచ్చింది. ఖతర్ ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ అధికార ప్రతినిధుల మధ్య బందీల విడుదలపై చర్చలు జరుగుతున్నాయి. ఖతర్ రాజధాని దోహా వేదికగా దీనిపై గత పది రోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన ఒప్పందంపై నేడో, రేపో ఒక అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ డీల్‌తో ముడిపడిన తాజా సమాచారం ఏమిటంటే.. ఇజ్రాయెల్‌కు హమాస్ రెండు షరతులు పెడుతోంది. ఐదు రోజుల కాల్పుల విరమణను పాటించాలి అనేది మొదటి షరతు. పశ్చిమ జెరూసలెంలోని ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 200 మంది పాలస్తీనా పిల్లలు, 75 మంది మహిళలను విడుదల చేయాలనేది హమాస్ రెండో షరతు. ఈ రెండు షరతులకు ఇజ్రాయెల్ సరేనని చెబితే.. తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలలో 70 మందిని విడుదల చేస్తామని హమాస్ అంటోంది. దీనిపై ప్రస్తుతం దోహాలో ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు చర్చించుకుంటున్నారు. విడుదల చేసే బందీల సంఖ్యను పెంచాలని హమాస్‌ను ఇజ్రాయెల్ కోరుతోంది. ప్రస్తుతం హమాస్ వద్ద దాదాపు 240 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా బందీల విడుదల ఒప్పందం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారి కుటుంబాలు నిరసనలతో ఇజ్రాయెల్‌ను హోరెత్తిస్తున్నారు. దీంతో నెతన్యాహు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దీంతో హమాస్ షరతులకు తలొగ్గుతారనే టాక్ వినిపిస్తోంది. ఈమేరకు వివరాలతో అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని(Israel – Hamas Deal) పబ్లిష్ చేసింది.