Imran Khan: అడియాలా జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన ఆరోగ్యం, భద్రత, జైలు పరిస్థితులపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన సోదరి ఉజ్మా ఖాటూన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఉజ్మా బయటకు వచ్చి.. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. దీంతో చాలా రోజులుగా జరుగుతున్న చర్చలకు కొంతవరకు తెరపడింది.
ఐసోలేషన్‌లో ఉంచారు
ఇమ్రాన్ ఖాన్ శారీరకంగా బాగానే ఉన్నారని, అయితే ఆయనను ఐసోలేషన్‌లో (ఒంటరిగా) ఉంచారని ఉజ్మా తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్‌ను రోజంతా ఒక గదిలో బంధించి ఉంచుతున్నారు. ఎవరినీ కలవడానికి అనుమతించడం లేదు. తన సోదరుడికి మానసిక హింస జరుగుతోందని ఆమె ఆరోపించారు. దీనిపై ఆయన చాలా కోపంగా ఉన్నారని చెప్పారు. ఇమ్రాన్‌ను ఉంచిన పరిస్థితులకు సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్‌ను ఆయన బాధ్యుడిగా భావిస్తున్నారని ఉజ్మా తెలిపారు.
Also Read: Lok Bhavan: రాజ్‌భవన్ నుండి లోక్‌భవన్.. అసలు పేరు ఎందుకు మార్చారు?!
రెండు వారాల పాటు సెక్షన్ 144 అమలు
జైలు వెలుపల ఇమ్రాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. పలుచోట్ల పోలీసులు, పీటీఐ (PTI) కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. మద్దతుదారులు నిరంతరం ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిపాలన ఇస్లామాబాద్రా, వల్పిండిలలో రెండు వారాల పాటు సెక్షన్ 144 ను అమలు చేసింది.
ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఇమ్రాన్ సోదరీమణులు గత వారం ఈ అంశంపై ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జైలు అధికారులు వాటిని పాటించడం లేదని, తమకు ఇమ్రాన్‌ను కలవడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుండి అడియాలా జైలులో ఉన్నారు. ఆయనను అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనపై, ఆయన భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ రాజకీయ కుట్రకు బలి అయ్యారని ప్రతిపక్షం వాదిస్తుండగా, ప్రభుత్వం ఈ ఆరోపణలను సమర్థిస్తోంది.
