చైనా దృష్టి అంత అరుణాచల్‌ప్రదేశ్‌ పైనేనా? ఎందుకని ?

చైనా జాతీయ పునరుజ్జీవన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విస్తృత భద్రతా వ్యూహంలో అరుణాచల్ ప్రదేశ్‌కు కీలక స్థానం ఉందని ఈ నివేదిక పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Is China's focus only on Arunachal Pradesh? Why?

Is China's focus only on Arunachal Pradesh? Why?

. చైనా జాతీయ పునరుజ్జీవం లక్ష్యం – 2049 రోడ్‌మ్యాప్

. విమర్శలపై కఠిన వైఖరి: హాంకాంగ్‌ నుంచి తైవాన్‌ వరకు

. భారత్‌-చైనా సంబంధాలు, ఎల్‌ఏసీ ఉద్రిక్తతలు

Pentagon report : అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తనకు అత్యంత ప్రాధాన్యమైన, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడలేని ప్రయోజనాల్లో ఒకటిగా భావిస్తోందని అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన తాజా నివేదికలో పెంటగాన్ స్పష్టం చేసింది. చైనా జాతీయ పునరుజ్జీవన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విస్తృత భద్రతా వ్యూహంలో అరుణాచల్ ప్రదేశ్‌కు కీలక స్థానం ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2049 నాటికి దేశాన్ని సంపూర్ణంగా పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో బీజింగ్ ముందుకు సాగుతోందని, ఆ దిశగా రాజకీయ, ఆర్థిక, సైనిక అంశాలను సమగ్రంగా అనుసంధానిస్తున్నట్లు వివరించింది. పెంటగాన్ అంచనా ప్రకారం, చైనా తన ప్రాంతీయ నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తైవాన్, సెంకాకు ద్వీపాలు మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనా జాతీయ భద్రతా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ఈ భూభాగాలు చైనా జాతీయ పునరుజ్జీవనానికి అత్యంత కీలకమని డ్రాగన్ భావిస్తోందని పేర్కొంది. భూభాగాలపై నియంత్రణ సాధించడమే కాకుండా, రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడం కూడా బీజింగ్ వ్యూహంలో ప్రధాన అంశంగా ఉందని నివేదిక విశ్లేషించింది. అలాగే, చైనా కమ్యూనిస్టు పాలనను ప్రశ్నించిన లేదా వ్యతిరేకించిన హాంగ్‌కాంగ్, టిబెట్, తైవాన్‌కు చెందిన రాజకీయ నాయకులను చైనా ప్రభుత్వం వేర్పాటువాదులుగా ముద్ర వేస్తోందని పెంటగాన్ నివేదికలో ప్రస్తావన వచ్చింది. అంతర్గత అసమ్మతులను అణిచివేసే విధానంలో భాగంగానే ఈ లేబులింగ్ జరుగుతోందని, దీని ద్వారా పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. భారత్-చైనా సంబంధాల విషయానికొస్తే, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య కుదిరిన గస్తీ ఒప్పందాన్ని కూడా పెంటగాన్ తన నివేదికలో గుర్తుచేసింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే చైనా ఈ ఒప్పందానికి ముందుకు వచ్చిందని అంచనా వేసింది.

అదే సమయంలో, అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడకుండా ఉండేలా చైనా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని నివేదిక వివరించింది. చైనా జాతీయ పునరుజ్జీవన వ్యూహంలో మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని పెంటగాన్ పేర్కొంది. మొదటిది చైనా కమ్యూనిస్టు పార్టీపై సంపూర్ణ నియంత్రణ కొనసాగించడం, రెండవది దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, మూడవది సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక వాదనలను నిలబెట్టుకోవడం. ఈ లక్ష్యాల సాధన కోసం చైనా దౌత్యం, ఆర్థిక బలం, సైనిక శక్తిని సమన్వయపరుస్తోందని నివేదిక స్పష్టం చేసింది. మొత్తంగా, అరుణాచల్ ప్రదేశ్ సహా వివాదాస్పద భూభాగాలపై చైనా తీసుకుంటున్న వైఖరి ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని పెంటగాన్ హెచ్చరించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న శక్తి సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, చైనా చర్యలను అమెరికా నిశితంగా గమనిస్తోందని ఈ నివేదిక స్పష్టంగా సూచిస్తోంది.

 

 

  Last Updated: 24 Dec 2025, 07:18 PM IST