Iran – Dress Code : మహిళల డ్రెస్ కోడ్ పై ఇరాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందే అని ప్రకటించింది. హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, వారికి మద్దతు తెలిపే వారికి భారీ శిక్షలు విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రతిపాదనలతో తీసుకొచ్చిన ముసాయిదా బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఇరాన్ పార్లమెంటులోని మొత్తం 290 మంది సభ్యులకుగానూ 152 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లు ప్రకారం.. హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలకూ ఇకపై శిక్షలు విధిస్తారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం పదేళ్లపాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ బిల్లుకు చివరగా గార్డియన్ కౌన్సిల్ ఆమోదం లభించాల్సి ఉంది.
Also read : Jagan Delhi sketch : `ఆపరేషన్ గరుడ`కు ఢిల్లీలో జగన్ పదును?
హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో మహసా అమిని అనే మహిళను గతేడాది సెప్టెంబర్ 20న మోరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు (2022 సెప్టెంబర్ 16న) ఆమె పోలీసు కస్టడీలో ఉండగా చనిపోయింది. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 500 మందికిపైగా పౌరులు చనిపోయారు. దాదాపు 22 వేల మందికి పైగా ఆందోళనకారులను అధికారులు నిర్బంధించారు. ఈనేపథ్యంలో హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు (Iran – Dress Code) శిక్షలు విధించేలా, వారికి మద్దతు తెలిపే వారికీ పనిష్మెంట్ ఇచ్చేలా బిల్లును ఇరాన్ ఆమోదించడం గమనార్హం.