Houthis : హౌతీల కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు.. సంచలన పరిణామం!

Houthis : ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై ‘రాయిటర్స్’ సంచలన కథనం ప్రచురించింది.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 08:02 AM IST

Houthis : ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై ‘రాయిటర్స్’ సంచలన కథనం ప్రచురించింది. నౌకలపై దాడులు చేసే విషయంలో యెమన్‌లో హౌతీ మిలిటెంట్లకు సహాయం చేసేందుకు కొంతమంది సైనిక కమాండర్లను ఇరాన్ ఆర్మీ, లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా రంగంలోకి దింపాయని తెలిపింది. హౌతీలకు ఆయుధాలు, శిక్షణ, నిధులను ఇరానే సమకూరుస్తోందని పేర్కొంది. హౌతీలకు అధునాతన డ్రోన్‌లు, యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు, ప్రెసిషన్ స్ట్రైక్ బాలిస్టిక్ క్షిపణులు, మీడియం రేంజ్ క్షిపణులను ఇరాన్ అందించిందని కథనంలో ప్రస్తావించారు. ప్రతిరోజూ ఎర్ర సముద్రం మీదుగా డజన్ల కొద్దీ నౌకలు ప్రయాణిస్తుంటాయి. వాటిలో ఇజ్రాయెల్‌ మూలాలు కలిగిన నౌకలు ఏవైనా ఉంటే గుర్తించి.. హౌతీలకు సమాచారాన్ని అందించే పనిని ఇరాన్ ఆర్మీ కమాండర్లే చేస్తున్నారని రాయిటర్స్ తెలిపింది. అయితే తమకు ఇరాన్ నుంచి కానీ.. హిజ్బుల్లా నుంచి కానీ సహాయం అందడం లేదని హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్ సలామ్ ఇటీవల ప్రకటించారు. ఈ యుద్ధాన్ని హౌతీలు(Houthis) వారి సొంత బలంపైనే చేస్తున్నారని, తాము సాయం చేయడం లేదని ఇరాన్ కూడా  స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అధునాతన ఆయుధాలను వినియోగించడంపై హౌతీలకు సెంట్రల్ ఇరాన్‌లోని సైనిక స్థావరంలో ఇరాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిందని రాయిటర్స్ కథనం పేర్కొంది. గత నెలలో హౌతీ మిలిటెంట్లకు చెందిన ముఖ్యమైన బృందం ఒకటి గత నెలలో ఇరాన్‌లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేసింది. సైనికపరమైన ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇరాన్ కమాండర్లు యెమెన్‌కు కూడా వెళ్లొచ్చారని తెలిపింది.  ఎర్ర సముద్రంలో విదేశీ నౌకలపై దాడులు చేసేందుకు యెమన్ రాజధాని సనాలో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని వివరించింది. ఈ కమాండ్ సెంటర్‌ను యెమన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఇరాన్ ఆర్మీ సీనియర్ కమాండర్‌ ఒకరు నిర్వహిస్తున్నారని కథనంలో ప్రస్తావించారు. యెమెన్‌లో 2011 సంవత్సరంలో అరబ్ స్ప్రింగ్ తిరుగుబాటు తర్వాత హౌతీలు కీలకంగా మారారు. దేశం యొక్క ఉత్తర భూభాగంపై పట్టును సాధించారు. 2014లో యెమన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనూ హౌతీలకు ఇరాన్ ఆర్మీ నుంచి బలమైన మద్దతు అందింది. ఎందుకంటే.. ఇరాన్‌లో షియా వర్గం జనాభా ఎక్కువ. యెమన్‌లోనూ షియా జనాభా అత్యధిక సంఖ్యలో ఉంది.

Also Read: Iran Attack : అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ఎటాక్