Iran New President : ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోయింది. ఇరాన్ మితవాద నేత, ప్రముఖ హార్ట్ సర్జన్ 69 ఏళ్ల మసౌద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి 58 ఏళ్ల సయీద్ జలీలీని మసౌద్ పెజెష్కియాన్ ఓడించారు. సయీద్ జలీలీకి 1.35 కోట్ల ఓట్లు పడగా.. పెజెష్కియాన్‌కు 1.63 కోట్ల ఓట్లు వచ్చాయి. దాదాపు 6 లక్షల చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం ఇరాన్(Iran) రాజధాని తెహ్రాన్ నగర వీధుల్లో పెజెష్కియాన్(Iran New President) మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు. కార్లలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించిన సయీద్ జలీలీ ఓటమిని అత్యంత కీలక పరిణామంగా చెప్పొచ్చు. గతంలో ఇరాన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇబ్రహీం రయీసీ అతివాద నేత. ఆయన అమెరికా, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా బలంగా వాణిని వినిపించేవారు. ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కూలడంతో.. ఆయన చనిపోయారు. తదుపరిగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ దేశాలతో చర్చలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తి ఇరాన్ అధ్యక్షుడు కావడం మారుతున్న పరిణామాలను అద్దంపడుతోంది.
Also Read :Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..
ప్రస్తుతం లెబనాన్‌తో యుద్ధానికి ఇజ్రాయెల్ కాలు దువ్వుతోంది. ఇరాన్ మిత్రదేశంగా లెబనాన్‌కు పేరుంది. లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు ఇరాన్ ఆయుధాలు అందిస్తుంటుంది. ఆర్థిక సాయం చేస్తుంటుంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లకు కూడా ఇరాన్ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంటుంది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఈవిషయాల్లో ఎలాంటి వైఖరిని తీసుకుంటారో వేచిచూడాలి. ఇరాన్ లో అధ్యక్షుడు కంటే సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఏ విషయంలోనైనా తుది నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. ఒకవేళ ఇరాన్ పాలసీలకు వ్యతిరేకంగా కొత్త అధ్యక్షుడు వ్యవహరిస్తే.. ఆ దేశంలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు.