Iran Vs Pakistan : పాకిస్తాన్‌పై ఇరాన్ మరోసారి ఎటాక్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి పాక్ సరిహద్దుల్లోని జైషల్ – అద్ల్ ఉగ్రవాద సంస్థకు చెందిన శిబిరాలపై ఇరాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో జైషల్ అద్ల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్, అతడి అనుచరులు కొందరు హతమయ్యారు. అయితే ఏ నగరంలో దాడి జరిగిందన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఆగ్నేయ ఇరాన్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల ఘటనల్లో షాబక్ష్ ప్రధాన నిందితుడని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇస్మాయిల్ ఉగ్ర చర్యలను నియంత్రించాలని పాక్‌ను (Iran Vs Pakistan) పలుమార్లు ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు అతడిని ఇరాన్ హతమార్చినట్టు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
- జైషల్ అద్ల్ సంస్థను 2012లో ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.
- ఇది ఇరాన్ ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్-బలూచిస్థాన్‌లో పనిచేస్తున్న సున్నీ ఉగ్రవాద సంస్థ.
- ఈ ఉగ్ర సంస్థ ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించి అక్కడి భద్రతా దళాలపై అనేక దాడులు నిర్వహించింది.
- గతేడాది డిసెంబరులో ఇరాన్ పరిధిలోని ఒక పోలీసు స్టేషన్‌లో కనీసం 11 మంది పోలీసులను చంపిన దాడికి జైషల్ అద్ల్ బాధ్యత వహించింది.
Also Read : Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్
నెల రోజుల కిందటే ఇరాన్, పాకిస్తాన్ దేశాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 16న కూడా పాక్‌పై ఇరాన్ (Iran Vs Pakistan) దాడి చేసింది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌పై ఇరాన్ ఆర్మీ ఎటాక్ చేయగా.. ఇద్దరు పిల్లలు చనిపోయారు. అప్పట్లో ఇరాన్ ధాటికి పాకిస్తాన్ ధీటుగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఆనాడు ఇరాన్‌లోని సరిహద్దు ప్రాంతాలపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపి ఉద్రిక్తతలను చల్లార్చారు. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండొద్దని, మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.