Iran Vs Pakistan : పాకిస్తాన్‌పైనా ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేసింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ జైష్ అల్ అద్ల్ యొక్క రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఇరాన్ ఆర్మీ క్షిపణులను సంధించింది. ఈమేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాక్, సిరియాలలోని ఐసిస్ స్థావరాలు, ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థ మోసాద్ కేంద్రంపై సోమవారం తెల్లవారుజామున ఇరాన్ ఆర్మీ బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. దాదాపు 1250 కిలోమీటర్ల దూరం నుంచి వాటిపైకి మిస్సైళ్లు వేసింది. ఈ దాడి చేసిన మరుసటి రోజే పాకిస్తాన్‌లోని బెలూచి తీవ్రవాద సంస్థ జైష్ అల్ అద్ల్ స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. ఈ స్థావరాలపైకి ఇరాన్ మిస్సైల్స్‌తో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా పడ్డాయని అంటున్నారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని తెలుస్తోంది. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తోనూ పాకిస్తాన్ బార్డర్‌ను కలిగి ఉంది. ఇరాన్ బార్డర్‌లోనే పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది. ఆ బార్డర్ ఏరియాలో గతంలో ఇరాన్ భద్రతా బలగాలపైకి జైష్ అల్ అద్ల్ ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి ప్రతీకారంగానే ఇప్పుడు ఇరాన్ ఎటాక్ చేసిందని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ దాడి వివరాలపై స్పందించేందుకు బెలూచిస్తాన్ ప్రావిన్స్ సమాచార మంత్రి జన్ అచక్జాయ్ నిరాకరించారు. దీనిపై పాక్ ఆర్మీయే(Iran Vs Pakistan) ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్‌కు చెందిన ప్రధాన భవనంపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోసాద్‌కు చెందిన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురు మరణించారని కుర్దిస్తాన్ రీజినల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. గాయపడ్డ ఆరుగురికి అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. మృతుల్లో అమెరికా అధికారులు గానీ, ఆ దేశ పౌరులు గానీ ఎవరూ లేరని వివరించింది. ఈ దాడిని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ దాడి తీవ్రతను అంచనా వేస్తున్నామని, దీన్ని తిప్పి కొట్టక తప్పదని హెచ్చరించింది.
Also Read: Chiranjeevi : చిరంజీవి ఫైట్ కోసం.. 50వేలు ఖర్చు చేసి.. ఆరు వేల కుండలను..
ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్‌లోని మోసాద్ కేంద్రం.. తమ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఇరాన్ ఆర్మీ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది. మోసాద్ కేంద్రంపై దాడి అనంతరం ఇరాక్ ఇవాళ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాక్ భూభాగంపై దాడికి పాల్పడకూడదనే సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను ఇరాన్ అధిగమించినట్టయిందని పేర్కొంది. దీని తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ(Iran Strike) హెచ్చరించింది.