Iran : మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తన వాయుసేన అవసరాల కోసం రష్యాపై ఆధారపడిన టెహ్రాన్, తాజాగా చైనా నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు చర్చలు ప్రారంభించింది.
తాజాగా అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల సమయంలో వాయుసేన ఏమీ చేయలేకపోవడం, పాత తరం యుద్ధ విమానాలతో విఫలమవుతున్న తీరును బట్టబయలు చేసింది. దీనితో తన వాయుసేనను ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నట్టు గ్రహించిన ఇరాన్, జే-10సీ యుద్ధ విమానాల కోసం చైనాతో చర్చలు వేగవంతం చేసింది.
వాయుసేన బలహీనత – 1979కి ముందు మోడల్స్‌నే ఆధారంగా
ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు ప్రధానంగా ఎఫ్-4, ఎఫ్-5, ఎఫ్-14 టామ్‌క్యాట్ వంటి పాత తరం మోడల్స్. వీటిలో చాలావరకు పనిచేయకపోవడంతో, ఇటీవల జరిగిన దాడుల్లో వాయుసేన నిస్సహాయంగా నిలిచింది. ‘ది మిలిటరీ బ్యాలెన్స్ 2025’ నివేదిక ప్రకారం, ఇరాన్ వాయుసేన పూర్తిగా ఆధునికీకరణ అవసరమున్న స్థితిలో ఉంది.
రష్యా జాప్యం… చైనాతో ముందడుగు
ఇరాన్ గతంలో రష్యా సుఖోయ్ ఎస్‌యూ-35 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఒక్కదాని సరఫరా కూడా జరగకపోవడంతో టెహ్రాన్ బీజింగ్ వైపు మొగ్గుచూపుతోంది. చైనా తయారు చేసిన జే-10సీ యుద్ధ విమానాలు ధరలో తక్కువగా ఉండటంతో పాటు, త్వరితగతిన లభ్యమయ్యే అవకాశాలు ఉండడంతో ఇరాన్ ఇప్పుడు చైనాతో ఒప్పందం కోసం చర్చలు ముమ్మరం చేసింది.
జే-10సీ ఫీచర్లు – ఆధునిక రాడార్, PL-15 క్షిపణులు
చైనాకు చెందిన చెంగ్డూ ఏరోస్పేస్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన జే-10సీ 4.5వ తరం మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇందులో ఉన్న ఏఈఈసా రాడార్ వ్యవస్థ శత్రు విమానాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించగలదు. ముఖ్యంగా PL-15 సుదూర క్షిపణుల ప్రయోగ సామర్థ్యం ఈ యుద్ధ విమానానికి ప్రత్యేకత. ఇది పాకిస్తాన్ వాడిన క్షిపణులాగే ఉండటంతో ప్రాంతీయ స్థాయిలో వ్యూహాత్మక ప్రాధాన్యతను ఇరాన్ పొందగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, ఇరాన్-చైనా మధ్య రక్షణ సంబంధాల్లో కీలక మలుపుగా నిలవనుంది. తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం గల యుద్ధ విమానాలను అందించగలగడం ద్వారా చైనా మధ్యప్రాచ్యంలో మరింత ప్రాబల్యం సంపాదించే అవకాశం ఉంది.
Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే