Site icon HashtagU Telugu

Indonesia: ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు మృతి.. కారణమిదే..?

Cough Syrups

Cough Syrup

ఇండోనేషియాలో సుమారు వంద మంది చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆ దేశంలో అన్ని రకాల సిరప్‌ మందులను బ్యాన్‌ చేసింది అక్కడి ప్రభుత్వం. విషపూరితమైన పదార్ధాలను కలిగి ఉన్నట్లు అనుమానించబడిన మెడికల్ సిరప్‌లపై అధికారులు విచారణ పూర్తి చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ సహ్రిల్ మాట్లాడుతూ.. కిడ్నీలపై ప్రభావం చూపే రసాయనాలు సిరప్ లలో ఉన్నట్లు ఇండోనేషియా గవర్నమెంట్ తెలిపింది. హానికరమైన సిరప్ లు వాడి 99 మంది చిన్నారులు మరణించారని, మరో 206 మంది చిన్నారులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల గాంబియాలో సిరప్‌లు తాగి దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందిన విషయం మనకు తెలిసిందే. లిక్విడ్ మెడిసిన్ లేదా సిరప్‌ను తాత్కాలికంగా రోగులకు సూచించవద్దని ఆరోగ్య కేంద్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలను ఇండోనేషియా మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా సిరప్ లపై పరిశోధనలు పూర్తయ్యే వరకు మందుల దుకాణాలు నాన్-ప్రిస్క్రిప్షన్ లిక్విడ్ మెడిసిన్ లేదా అన్ని రకాల సిరప్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.

చిన్నారుల మరణానికి కారణమైన మందులను దిగుమతి చేసుకున్నారా లేక ఇండోనేషియాలో ఉత్పత్తి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. గాంబియాలో 70 మంది చిన్నారులు మృతిచెందిన తర్వాత భారత్ సిరప్‌ల వల్ల ఆ మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.ఆగ్నేయాసియా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ ఏజెన్సీ ప్రకారం.. గాంబియాలో వాడిన సిరప్‌లు ఇండోనేషియాలో అందుబాటులో లేవు.

Exit mobile version