రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గాను భారతదేశంపై అదనపు సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయానికి భారత్ గట్టిగా స్పందించింది. ఈ చర్యను భారతదేశం “అన్యాయం, అసమంజసమైనది” అని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక పత్రికా ప్రకటనలో, తమ దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని, 1.4 బిలియన్ల భారతీయ పౌరుల ఇంధన భద్రతను నిర్ధారించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. అమెరికా చర్యను “తీవ్ర విచారకరం” అని అభివర్ణించిన MEA, అనేక ఇతర దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాల కోసం రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్నాయని గుర్తుచేసింది. ఈ విషయంలో కేవలం భారతదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వివక్షత అని పేర్కొంది.
ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్నారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొంటూ, భారతదేశం నుంచి దిగుమతులపై కొత్తగా 25% యాడ్ వాలోరెమ్ సుంకాన్ని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులో, భారతదేశం “ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ చమురును దిగుమతి చేసుకుంటోంది” అని పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా, శిక్షాత్మక సుంకాలను విధించడం “అవసరం మరియు సముచితం” అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Trump Tariffs : భారత్‌పై మరో 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్
ఈ కొత్త సుంకం.. ఆర్డర్ తేదీ నుండి 21 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది. ఇది ఆగస్టు 7 నుండి ఇప్పటికే అమలులోకి రానున్న ప్రత్యేక 25% సుంకానికి అదనం. అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య లోటును తగ్గించడం ఈ రెండో సుంకం యొక్క లక్ష్యం. వారం ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో “రష్యన్ యుద్ధ యంత్రం వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది చంపబడుతున్నారో వారు పట్టించుకోరు” అంటూ భారతదేశం పెద్ద మొత్తంలో తక్కువ ధరకు రష్యా చమురును కొనుగోలు చేసి లాభం కోసం తిరిగి విక్రయిస్తోందని ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, భారత ప్రభుత్వం “దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు” తీసుకుంటుందని పునరుద్ఘాటించింది. భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తూ, తన దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధన భద్రతను నిర్ధారించుకోవడానికి కట్టుబడి ఉంది. అయితే, ఈ కొత్త సుంకాల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయో వేచి చూడాలి.