కెనడా నుంచి అమెరికాలోకి (US-Canada Border) అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి సెయింట్ లారెన్స్ నదిలో మునిగి భారతీయ కుటుంబ సభ్యులతో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు సమాచారం అందించారు. కెనడియన్ వార్తా సంస్థలు CBC, CTV ప్రకారం.. తప్పిపోయిన పాప కోసం అన్వేషణ కొనసాగుతుండగా గురువారం ఉదయం క్యూబెక్ ప్రాంతంలో బోల్తాపడిన పడవ సమీపంలో ఆరు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
గురువారం కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలోని నది నుండి రొమేనియన్, భారతీయ సంతతికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఆరు మృతదేహాలను అధికారులు వెలికితీశారు.మరణాలకు గల కారణాలను నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం, టాక్సికాలజీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జనవరి నుండి దాదాపు 80 మంది వ్యక్తులు మోహాక్ ప్రాంతం ద్వారా కెనడా లేదా యునైటెడ్ స్టేట్స్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది భారతీయ లేదా రొమేనియన్ మూలాలకు చెందినవారని అక్వెస్నే పోలీసులు తెలిపారు. అక్వేసనే కెనడా-యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉంది. క్యూబెక్, అంటారియో, న్యూయార్క్ స్టేట్‌లో భూభాగాన్ని కలిగి ఉంది.
Also Read: Gang Rape : కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్ రేప్.. నలుగురు అరెస్ట్
ఈ ఆరుగురు వ్యక్తులు రెండు కుటుంబాలకు చెందిన వారుగా భావిస్తున్నామని అక్వేసనే మోహాక్ పోలీస్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ లీ-ఆన్ ఓబ్రెయిన్ శుక్రవారం తెలిపారు. ఒక కుటుంబం రొమేనియన్ మూలానికి చెందినది. మరొకటి భారతీయ మూలం. రొమేనియన్ కుటుంబానికి చెందిన పాప ఇంకా కనిపించలేదని, ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పారు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. సమాచారం ప్రకారం మృతులను ఇంకా గుర్తించలేదు. ఈ ఘటన హృదయాలను ద్రవించివేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.