Vivek Ramaswamy : డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం జరిగింది. భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ ప్రభుత్వ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ)లో తాను పనిచేసేది లేదని ఆయన వెల్లడించారు. అయితే డోజ్ లాంటి కీలకమైన విభాగానికి తనను ఎంపిక చేసినందుకు ట్రంప్‌కు రామస్వామి ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ సర్కారుకు తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. నూతన సర్కారును ట్రంప్ సమర్ధంగా నడపడంలో ఎలాన్ మస్క్ టీమ్ విజయం సాధిస్తుందని రామస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. ఒహియోలో తన భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలోనే ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు. దీంతో తదుపరిగా వివేక్ రామస్వామి ఏం చేయబోతున్నారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒహియో గవర్నర్ ఎన్నికలో పోటీ చేసేందుకే రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read :Maoists Encounter : ఛత్తీస్‌గఢ్ – ఒడిశా బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం
నూతన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు అత్యంత సన్నిహితుడిగానూ వివేక్ రామస్వామికి(Vivek Ramaswamy) పేరుంది. ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ఆయన పోటీపడ్డారు. తన పార్టీకి చెందిన అగ్రనేత ట్రంప్‌తో ఢీకొన్నారు. అలాంటిది ఆయన ప్రభుత్వంలో పనిచేయడం కంటే.. ఒహియో రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం మేలనే నిర్ణయానికి రామస్వామి వచ్చినట్లు తెలిసింది. తద్వారా భవిష్యత్తులో మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బలంగా పోటీపడొచ్చని ఆయన భావిస్తున్నారట. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక వ్యూహంతో రామస్వామి తన కొత్త ప్లాన్‌ను రెడీ చేసుకున్నారట. మొత్తం మీద భారత సంతతి నేతలు అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పుతుండటం మంచి పరిణామం.