Site icon HashtagU Telugu

Swiss Bank:స్విస్ బ్యాంకులో భారతీయుల అకౌంట్లు.. ఇండియాకు అందిన నాలుగో లిస్ట్!!

Swiss Bank

Swiss Bank

స్విస్ బ్యాంకుల్లో భారతీయ పౌరులు,సంస్థలకు చెందిన ఖాతాల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతో పాటు ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలను అధికారులు గుర్తించారు. అయితే ఆ అకౌంట్లు ఏయే వ్యక్తులు లేదా సంస్థలకు చెందినవో వెల్లడించడానికి నిరాకరించింది. వాస్తవానికి ఈ వివరాలను సెప్టెంబర్‌లోనే భారత ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం.ఆటోమేటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్‌ ఈ అకౌంట్ల వివరాలను భారత్‌కు అందించింది.
తాజాగా 101 దేశాలకు చెందిన 34లక్షల అకౌంట్ల వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్తగా నైజీరియా, పెరూ, టర్కీ, అల్బేనియా, బ్రూనీ వంటి దేశాలు చేరినట్లు ఫెడరల్ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది.దీనితో దాదాపు లక్ష అకౌంట్లు పెరిగినట్లు. అయితే, 101 దేశాల పేర్లు, వాటి అకౌంట్ల వివరాలను బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ జాబితాలో భారత్‌ ఉందని ఎఫ్‌టీఏ గుర్తించింది.

గత మూడేళ్ళలో..

స్విట్జర్లాండ్‌లో మన దేశస్థుల అకౌంట్ల వివరాలతో కూడిన తొలి జాబితా 2019లో అందుకుంది. ఆ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన అకౌంట్ల జాబితాను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో రెండో జాబితా, 2021 మూడో జాబితాలో 86 దేశాల వివరాలు ఉన్నాయి. ఐడీ, పేరు, అడ్రస్, నివాస దేశం, టాక్స్‌ ఐడీ, సంస్థకు చెందిన వివరాలు, అకౌంట్‌లో నగదు, మూలధనం వంటి అకౌంట్‌ల వివరాలు ఆయా ప్రభుత్వాలకు అందించిన నివేదికలో ఉంటాయని ఎఫ్‌టీఏ వెల్లడించింది. అయితే, 2018 ఆ తర్వాత క్రియాశీలంగా ఉన్న ఖాతాల వివరాలు మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడిస్తోంది.