Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపిన ఘటనను భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీంతో పాక్‌తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని పహల్గాం ఉగ్రదాడి గురించి తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. ప్రతి ఒక్క ఉగ్రవాదిని, వారికి మద్దతుగా నిలిచేవారిని భారత్ గుర్తించి, వెంటాడి శిక్షిస్తుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టిచూస్తే వారం రోజుల్లో పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని, పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాలంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ హెచ్చరించారు.
Also Read: Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం
భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ (2014-2017), జర్మనీకి మాజీ రాయబారి (2012-2014) అయిన అబ్దుల్ బాసిత్ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం సైనిక చర్య ప్రారంభించవచ్చని హెచ్చరించారు. ఇందుకు.. 2016 ఉరి, 2019 పుల్వామా దాడుల తర్వాత భారతదేశం తీసుకున్న చర్యలను బాసిత్ ఉదహరించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లో చేసిన ప్రసంగం సరిహద్దు దాటి దాడి, ఇతర విధానాల్లో స్పష్టమైన చర్యలను సూచిస్తుందని ఆయన అన్నారు.
Also Read: Kalma : కల్మా అంటే ఏంటి ? దీనికి టెర్రరిస్టులకు సంబంధం ఏంటి..?
“సరిహద్దు అవతల నుండి ఎప్పుడైనా దాడులు జరగవచ్చు. పాకిస్థాన్ భూభాగంలోకి వచ్చి లాంచ్ ప్యాడ్‌లతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని భారత్ చెబుతుంది. అది వారంలో జరిగినా, 15 రోజుల్లో జరిగినా ఏదో ఒకటి జరుగుతుందని అంటూ అబ్దుల్ బాసిత్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్ కొన్ని ప్రాంతాలలో మరిన్ని ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందని, పాకిస్తాన్ మరింత శాంతిభద్రతల అస్థిరతకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
సింధు జలాల ఒప్పందం యొక్క మధ్యవర్తి, హామీదారు అయిన ప్రపంచ బ్యాంకును సంప్రదించి, బలమైన దౌత్యపరమైన ప్రతిస్పందనను సిద్ధం చేయాలని అబ్దుల్ బాసిత్ అలీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశంపై ఆరోపణలు చేస్తూ, “భారతదేశం తన అంతర్జాతీయ బాధ్యతలను పాటించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానం పొందాలనే దాని ఆకాంక్షలకు ఇది చాలా పెద్ద విషయం” అని అన్నారు.