By: డా. ప్రసాదమూర్తి
India vs Canada : పశ్చిమ దేశాలతో భారత్ సత్సంబంధాలు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. కేవలం భారత్ కే కాదు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి పశ్చిమ దేశాలకు కూడా భారత్ తో సానుకూల సంబంధాలు కీలకమైనవే. వాణిజ్యపరంగా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసి, ఆర్థికంగా అగ్రరాజ్యంగా చైనా ఎదుగుదలను నిరోధించడం పశ్చిమ దేశాలకు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఇది నెరవేరాలంటే చైనాకు సరిహద్దు దేశమైన, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన, విస్తారమైన వనరులలో చైనాతో పోటీపడే దేశమైన ఇండియాతో (India) సంబంధాలు దృఢంగా ఉండాలి. ఈ దిశగా పశ్చిమదేశాలు భారత్ తో తమ సంబంధాలను దృఢపరుచుకోవడానికి అనేక రకాల వాణిజ్యపరమైన ఒప్పందాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే సరిహద్దులో మాటిమాటికి దురాక్రమణలు చేస్తూ, భారత్ ను ఒంటరిని చేసి తన గుప్పిట పెట్టుకోవడానికి చూస్తున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్ కు కూడా పశ్చిమ దేశాల మద్దతు కావాలి. కాబట్టి అటు పశ్చిమ దేశాలకు మన దేశం మతోను, మన దేశానికి పశ్చిమ దేశాలతోనూ నిరంతర సత్సంబంధాలు కొనసాగడం ఇరుపక్షాలకు శ్రేయోదాయకం. ఇలాంటి తరుణంలో భారత్, కెనడా (India vs Canada) వివాదం చెలరేగడం విచారకరం. కానీ చైనాకు అది వినోదకరమే కావచ్చు.
కెనడా (Canada) ప్రభుత్వానికి భారత్ ప్రభుత్వం అనేకమార్లు, కెనడా భూభాగంలో ఖలిస్తానీ ఉద్యమం కొనసాగుతోందని, దాని పట్ల కఠినంగా వ్యవహరించాలని విన్నవించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో జరుగుతున్న సిక్కు ఖలిస్తానీ నిరసన ప్రదర్శనలను నిరోధించాలని, వాటిపట్ల తమ ఆందోళనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తో వ్యక్తం చేశారు. మిగిలిన దేశాల కంటే కెనడాలో ఎక్కువగా పంజాబ్ నుంచి వెళ్లిన సిక్కు సంతతి ఉన్నారు. ఇప్పుడు కెనడా (Canada) ప్రభుత్వం ఆరోపిస్తున్న హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఖలిస్తానీ ఉద్యమాల పట్ల వహించిన నిర్లక్ష్యానికి ఒక ఉదాహరణ మాత్రమే. భారత ప్రభుత్వం మాటిమాటికి హెచ్చరిస్తున్నప్పటికీ కెనడాలో కొనసాగుతున్న ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎలాంటి చర్యలు కెనడా ప్రభుత్వం తీసుకోలేదు. పైగా ప్రదర్శనలను అడ్డుకోవడం అంటే భావ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమే అని కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగానే అన్నారు. మరి ఈ మాటలతో కెనడా ప్రభుత్వం తమ భూభాగంలో భారత్ కు వ్యతిరేకంగా సాగుతున్న వేర్పాటువాద చర్యలకు పరోక్షంగా తోడ్పడుతున్నట్టే కనిపిస్తోంది.
వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా నెలకొంటాయి? నిజ్జర్ హత్య విషయాన్ని పశ్చిమ దేశాల ప్రధాన సమస్యగా చేయడానికి కెనడా (Canada) ప్రధాని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తదితర దేశాలను చర్యలు తీసుకోవాల్సిందని ఒత్తిడి తెస్తున్నారు. ఈ కారణాల రీత్యా ఇండియా (India), ఇతర పశ్చిమ దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ప్రమాదం ముంచుకొస్తోంది.
చైనా ప్రమాదకరమైన ఆర్థిక శక్తిగా దూసుకు వస్తోంది. దాన్ని అడ్డుకోవాలంటే ఇండియా (India) మద్దతు పశ్చిమ దేశాలకు అవసరం. ఈ దృష్టితోనే కెనడా 2022లో ఇండో పసిఫిక్ వ్యూహాన్ని ముందుకు తీసుకువచ్చింది. చైనా ఒక విధ్వంసకర శక్తిగా ఎదుగుతోందని, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి మనమంతా కలవాలని కెనడా చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు కెనడా వ్యవహరిస్తున్న తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇండియా మీద ఒత్తిడి తీసుకురావడానికి కెనడా చేస్తున్న ప్రయత్నాలతో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు తలొగ్గుతాయా అనేదే ప్రశ్న. కెనడా ఆరోపణలు పట్టుకొని భారతదేశంలో వాణిజ్య సంబంధాల విషయంలో ఈ అగ్రరాజ్యాలు వెనకడుగు వేస్తే, అది పరోక్షంగా చైనాకు విజయం చేకూర్చినట్టే. అలాంటి అవకాశాన్ని అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలు చైనాకు ఇస్తాయని అనుకోలేం. అంతేకాదు చైనాను నిలవరించడంలో కెనడా మార్కెట్ కు భారతదేశం అతిపెద్ద ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. కెనడాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న పది దేశాలలో ముఖ్యమైనది ఇండియా.
మరి ఇండియా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వేర్పాటువాద చర్యలను కెనడా ప్రోత్సహించి, ఇండియాతో సంబంధాలను చెడగొట్టుకుంటుందా? తద్వారా పశ్చిమ దేశాలకు ఇండియాకు మధ్యన సంబంధాలను దెబ్బతీస్తుందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. అలా జరిగితే అందరూ కలిసి చైనా ఎలాంటి ప్రమాదకర శక్తిగా ఎదుగుతుందనుకుంటున్నారో, దాన్ని అడ్డుకునే అవకాశాలన్నీ వదులుకున్నట్టే. కాబట్టి ఈ విషయంలో పశ్చిమ దేశాలు ఆచితూచి అడుగేస్తాయని, ఇండియా కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందని అందరూ భావిస్తున్నారు.