అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ చీమలు అమెరికాలో దశాబ్దాల క్రితమే కనిపించినప్పటికీ, గత కొన్నేళ్లుగా వీటి జనాభా అసాధారణంగా పెరిగింది. సాధారణ చీమల మాదిరిగా ఇవి పుట్టలు పెట్టకుండా, నేల రాలిన ఆకులు, కుళ్ళిన మొద్దులు, అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయి. దీనివల్ల మనుషులు తెలియకుండానే వీటిపై కాలు వేయడం లేదా తాకడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ చీమల కుట్టు అత్యంత వేదనాభరితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పదునైన సూదిని శరీరంలోకి నేరుగా గుచ్చితే ఎంత తీవ్రమైన నొప్పి కలుగుతుందో, ఈ చీమ కుడితే అంతటి నొప్పి ఉంటుందని కీటక శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ నొప్పి కొన్ని గంటల పాటు బాధిస్తుంది. ముఖ్యంగా అలర్జీ ఉన్నవారిలో ఇది ‘అనాఫిలాక్సిస్’ వంటి ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉంది. వీటి స్టింగర్ ఎంత బలంగా ఉంటుందంటే, బట్టల గుండా కూడా కుట్టగలదు.
అయితే, ఈ చీమలు సహజంగా దుందుడుకు స్వభావం కలిగినవి కావని, తమకు ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు మాత్రమే కుడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే తోటపని చేసేవారు లేదా బయట తిరిగేవారు గ్లోవ్స్ ధరించాలని, ఈ చీమలు కనిపిస్తే జాగ్రత్తగా అక్కడి నుండి తప్పుకోవాలని సూచిస్తున్నారు. వీటి వ్యాప్తిని అడ్డుకోవడం ఇప్పుడు దాదాపు అసాధ్యమని, అమెరికా పర్యావరణంలో ఇవి ఒక భాగం అయిపోయాయని అమెరికా వ్యవసాయ శాఖ అభిప్రాయపడింది.
