Hindu Woman : పాకిస్తాన్‌లోనూ హిందువులు ఉన్నప్పటికీ వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఆ దేశంలోని 170 జిల్లాల నుంచి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం పొందే హిందువుల సంఖ్య నామమాత్రం. ఈనేపథ్యంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్ జిల్లా నుంచి తొలిసారిగా ఒక హిందూ మహిళ(Hindu Woman) ఎన్నికల కోసం నామినేషన్ వేసింది. ఆమె పేరు.. సవేరా ప్రకాష్. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. బునెర్ జిల్లాలోని పీకే-25 జనరల్ సీటు నుంచి సవేరా ప్రకాష్ బరిలోకి దిగారు. ఈమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రిటైర్డ్ డాక్టర్ ఓమ్ ప్రకాష్. డాక్టర్ ఓమ్ ప్రకాష్ దాదాపు 35 ఏళ్ల నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలోనే ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని సవేరా ప్రకాష్ అంటోంది.
We’re now on WhatsApp. Click to Join.
అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సవేరా ప్రకాష్.. బునెర్ జిల్లా PPP మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక మహిళల హక్కుల కోసం పాటుపడతానని ఆమె అంటున్నారు. ‘‘ఒక వైద్యుడిగా ఈ ప్రాంతంలోని ప్రజలకు మా నాన్న ఎంతో సేవ చేశారు. నేను కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాను’’ అని సవేరా ప్రకాశ్ చెప్పారు. పీపీపీ పార్టీ సీనియర్ నాయకత్వం తన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తుందనే ఆశాభావంతో డిసెంబర్ 23న నామినేషన్ దాఖలు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మొత్తం సీట్లలో 5 శాతం మహిళలకు రిజర్వ్ చేయాలని ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) అనేది భుట్టో ఫ్యామిలీకి చెందినది. ప్రస్తుతం ఈ పార్టీని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో లీడ్ చేస్తున్నారు.