129 Prisoner Killed : కాంగో రాజధాని కిన్షాసాలోని మకాలా జైలులో ఖైదీలు తిరగబడ్డారు. వారంతా జైలు నుంచి పారిపోయేందుకు యత్నించ డంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో దాదాపు 129 మంది ఖైదీలు(129 Prisoner Killed) చనిపోయారు. జైలు నుంచి పారిపోతున్న ఖైదీలపైకి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో 24 మంది ఖైదీలు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే జైలు నుంచి ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మాత్రమే చనిపోయారని తెలిపాయి. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయని, ఏం జరిగిందో అర్థం కావడం లేదని ఆ జైలులోని ఖైదీలు అంటున్నారు. జైలు అధికారులు, ఖైదీల వాదన వేర్వేరుగా ఉండటంతో అసలు ఏం జరిగింది ? జైలు అధికారులు చెబుతున్నది నిజమేనా ? లాకప్ డెత్‌లు జరిగాయా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో కాంగో హోం మంత్రి జాక్వెమిన్ షాబానీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున మకాలా జైలులో తొక్కిసలాట చోటుచేసుకుందని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి కేవలం 1500 మంది ఖైదీల కెపాసిటీతో మకాలా జైలును నిర్మించారు. కానీ అందులో 12 వేల మంది ఖైదీలను ఉంచారు. దీంతో ఖైదీలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. అత్యంత దారుణ స్థితిలో వారు జైలులో ఉండేవారు. వీరిలో విచారణ ఖైదీలు కూడా వేలాది మంది ఉన్నారు.కాగా, 2017 సంవత్సరంలో ఈజైలుపై ఓ వర్గానికి చెందిన మిలిటెంట్లు దాడి చేసి డజన్ల కొద్దీ తీవ్రవాదులను విడిపించుకొని వెళ్లారు. కాంగో సహా చాలా ఆఫ్రికా దేశాల్లో జైళ్లు చాలా ఇరుకుగా, దారుణంగా ఉంటాయి. అవి మినీ నరకాన్ని తలపిస్తాయి. తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడంతో జైళ్లలో ఖైదీలకు తగిన వసతులు ఉండవు. జైళ్ల క్యాంపస్‌లు చాలా చిన్నగా ఉంటాయి. దీంతో ఖైదీలు ఇరుకైన ఆ వాతావరణంలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంటుంది.