240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?

సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 08:45 AM IST

సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట. కరోనా తరువాత విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఓ నివేదిక ప్రకారం 2021-22 తర్వాత యూఎస్‌లో మన స్టూడెంట్స్ హవా 20 శాతం పెరిగింది.

విదేశీ విద్య అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికానే. అయితే దాదాపు 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభకు వెల్లడించిన వివరాలివి. భారతీయులు ఇప్పటికీ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలను ఉన్నత విద్య కోసం ఇష్టపడుతున్నారు. ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిజిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాల వైపు కూడా భారతీయ విద్యార్థులు ఆకర్షితులవుతున్నట్లు ఇటీవల వెల్లడైంది.

ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కరోనా తర్వాత విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో దాదాపు 7.5 లక్షల మంది విదేశీ చదువుల కోసం దేశం విడిచి వెళ్లారు. 2017 నాటి గణాంకాల కంటే ఇది చాలా ఎక్కువ. అప్పట్లో కేవలం 4.5 లక్షల మంది మాత్రమే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. USలో అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ఈ విషయంలో గత ఏడాది చైనాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

Also Read: Mahatma Gandhi statue: కెనడాలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం

ఓపెన్ డోర్స్ 2022 నివేదిక ప్రకారం.. 2021-22 తర్వాత USలో భారతీయ విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగింది. 2019లో బ్రిటిష్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ రూట్ వీసాను ప్రవేశపెట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల రాక పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019లో భారతీయ విద్యార్థులకు 24261 స్టడీ వీసాలు జారీ చేయగా.. 2022 నాటికి ఈ సంఖ్య 1.4 లక్షలకు చేరుకుంది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 2019లో స్టడీ పర్మిట్ పొందిన భారతీయుల సంఖ్య 2.2 లక్షలు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయులు మొత్తం 34 శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 3 లక్షలు.

వైద్య విద్య కోసం చాలా మంది భారతీయులు ఉక్రెయిన్, చైనాలకు వెళ్తున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న సుమారు 18 వేల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కరోనా పేరుతో భారతీయులకు వీసాల జారీని నిలిపివేసిన తరువాత చైనా గత ఆగస్టులో మళ్లీ జారీ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 6200 మంది చైనా వీసా పొందారు.