Site icon HashtagU Telugu

Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్‌ పేరు.. తెర వెనుక జెమీమా!

Imran Khan Nobel Peace Prize Pakistan

Imran Khan : ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మంచిరోజులు రాబోతున్నాయా ? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఆ దిశగానే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ గత వారం ఏకంగా అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ పేరును నామినేట్ చేశారు. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా, పాకిస్తాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచేందుకు తెర వెనుక నుంచి బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై సానుభూతి కలిగిన జాతీయ, అంతర్జాతీయ సంఘాలు.. ఆయన అధికారంలోకి వస్తే తమకు లాభం చేకూరుస్తారని భావించే దేశాలు ఈ పని చేస్తుండొచ్చు.

నార్వే రాజకీయ పార్టీ చొరవ చూపించి.. 

నార్వే దేశ రాజకీయ పార్టీ  పార్టియట్ సెంట్రమ్‌కు అనుబంధంగా పనిచేసే న్యాయవాదుల సంఘం పేరు పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA) . ఇది 2024 డిసెంబరులోనే ఏర్పాటైంది. ఈ సంఘమే ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం  నామినేట్ చేసింది. పాకిస్తాన్‌లో  మానవ హక్కుల పునరుద్ధరణ, ప్రజాస్వామిక భావజాలం వ్యాప్తికి ఇమ్రాన్ ఖాన్ ఎనలేని కృషి చేశారని PWA తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఇమ్రాన్ పేరును నామినేట్ చేయడం ఇది రెండోసారి.  ఇక తమ పార్టీ తరఫున ఇమ్రాన్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశామని పార్టియట్ సెంట్రమ్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. పాకిస్తాన్‌కు సుదూరంగా ఉన్న నార్వే వైపు నుంచి ఈ ప్రయత్నం ఎందుకు జరిగింది ?  ఇమ్రాన్‌పై పార్టియట్ సెంట్రమ్ పార్టీకి ఎందుకీ అభిమానం ? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలామందికి తెలియవు.

తెర వెనుక జెమీమా గోల్డ్ స్మిత్

ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పేరు జెమీమా గోల్డ్ స్మిత్. ఆమె బ్రిటన్ పౌరురాలు. 1995లో జెమీమాను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 2004లోనే జెమీమా, ఇమ్రాన్  విడాకులు తీసుకున్నారు. బ్రిటన్ రాజ కుటుంబంతో జెమీమా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జెమీమా తండ్రి చాలా సంపన్నుడు. ఆయన పెద్ద ఫైనాన్షియర్. 1996లో ఒకసారి డయానా స్వయంగా లాహోర్‌కు వచ్చి జెమీమాను కలిశారు. జైలులో చిక్కుకొని అష్టకష్టాలు అనుభవిస్తున్న తన మాజీ భర్త కోసం జెమీమా పావులు కదపబట్టే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయని భావిస్తున్నారు.