Site icon HashtagU Telugu

Imran Khan: పాక్ మంత్రుల విదేశీ పర్యటనలపై ఇమ్రాన్ ఖాన్ ఫైర్

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ సమయంలో దేశ మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్న తీరుపై ఆ దేశ మాజీ ప్రధాని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. దేశ ఖజానాను వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ విదేశీ పర్యటనలపై షాకింగ్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకం కోసం బ్రిటన్ వెళ్లగా, విదేశాంగ మంత్రి బిలావల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శించారు.

లాహోర్‌లో జరిగిన పీటీఐ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు విదేశాంగ మంత్రి బిలావల్ ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేశారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ పరువు పోతోందని అన్నారు. పాకిస్థాన్ సంక్షోభంలో ఉన్న సమయంలో దేశ అధినేతలు విదేశీ పర్యటన చేపట్టడం ద్వారా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు. బిలావల్ మీరు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారనీ, అయితే ఈ పర్యటనలకు దేశ ప్రజల సొమ్ము కేటాయిస్తున్నారేంటి అని ఎవరైనా అడిగారా అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. ఖర్చు చేయడం వల్ల ఏమి వస్తుంది? భారత్ పర్యటన వల్ల ప్రయోజనం ఏమిటని ఇమ్రాన్ ప్రశ్నించారు.

తాజాగా గోవాలో SCO సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు, SCO సమావేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టాలని అన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆరోపించారు.

Read More: Bus Falls Into Ditch: లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఐదుగురు దుర్మరణం, 17 మందికి గాయాలు