Site icon HashtagU Telugu

Pakistan: దివాళా దెబ్బకు పాక్ ప్రజలపై పెనుభారం

Pakistan

Pakistan

దాయాది పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక పరిస్థితి పతనం అంచుకు చేరింది. నేడో రేపో దివాలా తీయడం ఖాయంగా మారింది. దీంతో IMF బెయిలౌట్ ప్యాకేజ్‌ కోసం ప్రజలపై పెను భారం మోపేందుకు సిద్ధమైంది పాక్‌. ట్యాక్సుల రూపంలో 170 బిలియన్ రూపాయలు వసూలు చేయనుంది. ఆర్థిక సంక్షోభంలో నిండా మునిగిన పాకిస్థాన్‌.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు తలొగ్గింది. ఉద్దీపన ప్యాకేజీ కోసం IMF చెప్పిన అన్ని షరతులకు తలూపింది. ధరల పెరుగుదల, ఇంధన కొరతతో ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై మరింత భారం మోపుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఉద్దీపన ప్యాకేజీ కోసం పాకిస్థాన్, ఐఎంఎఫ్ అధికారుల మధ్య 10 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తొలి విడతగా 1.1 బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఈ సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కేబినెట్‌కు చెందిన ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ.. కొత్త పన్నులకు ఆమోదం తెలిపింది. విద్యుత్‌పై ఒక్కో యూనిట్‌కు 3.21 వరకు పెంచేసింది. స్పెషల్ ఫైనాన్సింగ్ సర్‌ఛార్జి కింద 3.39 చొప్పున ఏడాది పాటు వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ఒక్కో యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున మూడు నెలలపాటు రికవరీ చేయాలని నిర్ణయించినట్టు పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్‌ వెల్లడించారు. దీంతో దాయాది దేశంలో విద్యుత్ ఛార్జీలతో పాటు, నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరగనున్నాయి.

Also Read: CBSE: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం..!

ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వడమే కాదు.. ఇండస్ట్రీలకూ పెద్ద ఝలక్ ఇచ్చింది పాక్ కేబినెట్‌. ఐఎంఎఫ్ షరతుల మేరకు మార్చి 1 నుంచి జీరో రేటింగ్ కలిగిన పరిశ్రమలకు రాయితీలు, కిసాన్ ప్యాకేజీని సైతం ఎత్తివేయాలని నిర్ణయించింది. జనరల్ సేల్స్ ట్యాక్స్‌ను సైతం 1 శాతం మేర పెంచింది. ప్రజలపై పన్నుల భారం ద్వారా 17వేలకోట్ల ఆదాయం పాకిస్థాన్‌ ఆర్జించనుంది. ప్రజల నెత్తిన పెను భారం మోపిన పాకిస్థాన్‌.. రక్షణ కేటాయింపుల విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడంలేదు. డిఫెన్స్ రంగానికి టెక్నికల్‌ పప్లిమెంటరీ గ్రాంట్ కింద 450 మిలియన్లు ఇస్తూ.. ఇదే భేటీలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పాకిస్థాన్‌ విదేశీ మారకం నిల్వలు 3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో ఇంపోర్ట్స్‌ తీవ్ర ప్రభావం పడుతోంది, ముఖ్యంగా చమురు దిగుమతులపై భారీగా ఎఫెక్ట్‌ పడింది. లీటర్ డీజిల్ ధర 262 రూపాయలకు చేరింది. పెట్రోల్ రేటు కూడా 249 దాటింది. దీంతో ఇంధన సంక్షోభంతో పాక్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రావిన్సుల్లో పెట్రోల్ బంకులు ఖాళీ అవుతున్నాయి. కొద్దిపాటి నిల్వలు ఉన్న పెట్రోల్ బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరుతున్నాయి.