Pakistan : పాకిస్తాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) గుడ్ న్యూస్ చెప్పింది. ఆ దేశానికి రూ.58వేల కోట్ల లోన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దీంతో దివాలా అంచుల్లో ఉన్న పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించనుంది. మూడేళ్ల కాల వ్యవధి కోసం పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ఈ లోన్ అందజేసింది. ఈ లోన్‌ను తీసుకున్నందుకుగానూ పాకిస్తాన్‌కు(Pakistan) ఐఎంఎఫ్ కొన్ని షరతులు విధించింది. పలు రంగాల్లో సంస్కరణలు చేయాలని స్పష్టం చేసింది. అందుకు పాక్ అంగీకరించినందు వల్లే ఐఎంఎఫ్ లోన్ మంజూరు చేసింది.
Also Read :Israel Vs Lebanon : లెబనాన్‌పై భూతల దండయాత్రకు ఇజ్రాయెల్ రెడీ.. సైనికులకు ఆదేశాలు
1958 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్ 24సార్లు లోన్లు తీసుకుంది. ఆ లోన్లు తీసుకున్న ప్రతిసారి ఐఎంఎఫ్ పెట్టే షరతులకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పాకిస్తాన్ సంస్కరణలు చేస్తూ ముందుకుసాగింది. 2022 సంవత్సరం నుంచి పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడ గోధుమ పిండి, చక్కెర, పెట్రోలు వంటి వాటి ధర మన దేశంలో కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ రేంజులో ఉంది. దీన్ని బట్టి పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, భూములపై ట్యాక్స్ వంటివన్నీ పెంచాలని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ సిఫారసు చేసింది. పెట్రోలు, డీజిల్‌పైనా పన్నులు పెంచాలని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. చివరకు పాకిస్తాన్‌లో గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు పెరగడానికి కూడా ఐఎంఎఫ్ షరతులే కారణం. కాగా, ఐఎంఎఫ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాలు ఆర్థిక విధానాలను స్వతంత్రంగా రూపొందించుకోవడం కష్టతరం అవుతుంది. ఐఎంఎఫ్ షరతులకు లోబడి పనిచేసే క్రమంలో అవి స్వేచ్ఛను కోల్పోతాయి. ఫలితంగా దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చే సంస్కరణలు చేసే అవకాశం లేకుండాపోతుంది. ఐఎంఎఫ్‌లో అత్యధికంగా అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడులు ఉన్నాయి. అందుకే వాటి ప్రయోజనాలను పరిరక్షించేలా ఐఎంఎఫ్ షరతులు ఉంటాయి.