IMF and Srilanka: లంకకు శుభవార్త.. ఐఎంఎఫ్ నుంచి రూ.23వేల కోట్ల లోన్.. ఎలా ఖర్చు చేస్తారంటే?

శ్రీలంక కు ఒక శుభవార్త. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశానికి రూ.23వేల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 05:25 AM IST

శ్రీలంక కు ఒక శుభవార్త. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ దేశానికి రూ.23వేల కోట్ల ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సిద్ధమైంది. దీనిపై శ్రీలంక కొత్త ప్రభుత్వం, ఐఎంఎఫ్ మధ్య ప్రాథమిక ఒప్పందం కూడా కుదిరింది. రూ.23వేల కోట్ల నిధులతో శ్రీలంకను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించే దిశగా.. ఆ దేశ ప్రభుత్వం తనవంతు చర్యలు చేపట్టనుంది. ఈ లోన్ మంజూరు ప్రక్రియలో అడుగులు ముందుకు పడాలంటే.. శ్రీలంక ప్రభుత్వానికి చెందిన కొన్ని ఆర్ధిక, ద్రవ్య నియంత్రణ సంస్థలు కూడా ష్యురిటీ సంతకాలు చేయాల్సి ఉంటుంది. మొత్తం 48 నెలల్లో ఈ 23వేల కోట్ల లోన్ ను ఉపయోగించి శ్రీలంకలో ప్రజా పనుల వ్యయాన్ని పెంచుతారు. విద్యుత్, ఇంధన ధరలను నియంత్రణలోకి తీసుకోచ్చే చర్యలను అమలు చేస్తారు. శ్రీలంక కేంద్ర బ్యాంకు వ్యవస్థ ను పటిష్టం చేసి.. దాని పరిధిలో కార్యకలాపాలను ముమ్మరం చేస్తారు. శ్రీలంక పన్నుల వ్యవస్థలోనూ కొత్త సంస్కరణలు తీసుకొస్తారు. పర్సనల్ ఇంకమ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇంకమ్ ట్యాక్స్, వ్యాట్ విధివిధానాలలో కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.ఈ అన్ని చర్యల ద్వారా శ్రీలంక సర్కారుకు వచ్చే ఆదాయాన్ని పెంచడమే ఐఎంఎఫ్ లోన్ అంతిమ లక్ష్యం.

2024 నాటికి..

2024 నాటికి శ్రీలంక జీడీపీ లో ప్రాథమికంగా 2.3 శాతం సర్ ప్లస్ ను సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే గత మంగళవారమే పార్లమెంటు లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం లో శ్రీలంక ద్రవ్యలోటు 9.8 శాతానికి పెరగొచ్చని అందులో ప్రస్తావించారు. ఇంతకుముందు అంచనా వేసిన (8.8 శాతం) దాని కంటే ఇది 1 శాతం అదనం.

ఐఎంఎఫ్ టీమ్ పర్యటన..

శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్యనిధి బృందం పర్యటించనుంది. ఈ నెల 24 నుంచి 31దాకా ఎనిమిది రోజుల పాటు IMF బృందం శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. ఆర్థిక విధానాలు, సంస్కరణలు, ఆర్థిక సాయం వంటివాటిపై చర్చించనుంది. శ్రీలంకకు అందించే అప్పులపై ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోవడమే ఈ పర్యటన లక్ష్యం.

హామీలు కుదిరితేనే..

శ్రీలంకకు భారీగా అప్పులిచ్చేందుకు IMF సిద్ధంగా ఉన్నప్పటికీ..హామీలు కోరుతోంది. దివాళా తీసిన శ్రీలంకకు IMF ఒప్పందం కుదిరేదాకా ఇతర దేశాలు అప్పులిచ్చే పరిస్థితి లేదని నెల క్రితం రణిల్ విక్రమ్‌సింఘే ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాలు దొరక్క..బతికే దారిలేక శ్రీలంక ప్రజలు కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారితీసింది. కొత్త అధ్యక్షుని ఎన్నికకు దారితీసింది. రాజకీయంగా ప్రశాంత పరిస్థితులు ఉండడంతో IMFతో ఒప్పందం కుదుర్చుకోవడం…ఇతర దేశాల నుంచి అప్పులు పొందడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవాలని శ్రీలంక ఆరాటపడుతోంది.