Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!

కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్‌ తెలిపారు.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 09:05 AM IST

కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్‌ తెలిపారు. వర్చువల్‌గా కోర్టు విచారణలో చేరేందుకు తనను అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్‌పై ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్‌కు లేఖ కూడా రాశారు.

ఇస్లామాబాద్‌లో హత్యకు సన్నాహాలు

ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో శనివారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో తనను చంపడానికి కుట్ర పన్నినట్లు పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తోషఖానా కేసులో విచారణ కోసం ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ఆవరణలో ఉన్నారని, వారు తనను చంపాలనుకున్నారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

ఇమ్రాన్ కోర్టు ఆవరణలోకి రాగానే హఠాత్తుగా మా కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు బయటపెడుతూనే ఉంటే తాను ఎక్కువ కాలం జీవించలేనని ఇమ్రాన్ అన్నారు. తనను చంపితే ఎవరు బాధ్యత వహిస్తారని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూక్‌లకు లేఖలు రాస్తూ కోర్టు విచారణలకు వర్చువల్‌గా హాజరు కావడానికి అనుమతించాలని కోరారు.

Also Read: Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోనున్న రూపర్ట్ మర్డోక్

తనను, తన పార్టీని సైన్యానికి వ్యతిరేకంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పీఎంఎన్‌ఎల్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఆరోపించారు. గత వారం రోజులుగా PTI మద్దతుదారులకు, పోలీసులకు మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. దీంతో 300 మంది పీటీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు, పలువురు పీటీఐ మద్దతుదారులు కూడా గాయపడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌పైనే అనేక కేసులు కూడా నమోదయ్యాయి.