Hurricane Helene : ఏటా అమెరికాలోని సముద్ర తీర ప్రాంతాలను హరికేన్లు కుదిపేయడం సర్వసాధారణం. ఈ ఏడాది కూడా హెలెనా అనే హరికేన్ అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఈ భారీ తుఫాను కారణంగా ఇప్పటిదాకా దాదాపు 44 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయి వారిలో పెద్దసంఖ్యలో పిల్లలు, మహిళలు కూడా ఉండటం విషాదకరం. దాదాపు రూ.2 లక్షల కోట్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇది కేటగిరీ-4 హరికేన్(Hurricane Helene) అని అధికార వర్గాలు చెబుతున్నా.. దాని వల్ల సంభవించిన నష్టం చాలా పెద్ద రేంజులోనే ఉంది. భారీ వర్షాల కారణంగా ప్రభావిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా స్తంభించింది. దీంతో ప్రజలు గంటల తరబడి అంధకారంలో మగ్గాల్సి వచ్చింది.
Also Read :Mumbai Alert : ఉగ్రదాడుల ముప్పు.. ముంబైలో అలర్ట్
- జార్జియాలోని యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తాయి. దీంతో హెలికాఫ్టర్ సాయంతో ఆ ఆస్పత్రిలోని 54 మందిని రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
- టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో ఉన్న ప్రదేశాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడున్న దాదాపు 7 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
- ఫ్లోరిడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హరికేన్ తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.
- ఈ తుఫాను ప్రభావంతో అట్లాంటాలో కేవలం 48 గంటల వ్యవధిలో భారీగా 28.24 సెం.మీ.ల వర్షపాతం కురిసింది. చివరిసారిగా 1886 సంవత్సరంలో ఇక్కడ అత్యధికంగా 24.36 సెం.మీ వర్షం కురిసింది.
- హరికేన్ ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో విద్యాసంస్థలను బంద్ చేశారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.ఈవివరాలను స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అందరూ సురక్షితంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.
- యుద్ధాల్లో బిజీగా ఉన్న అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం.. దేశ ప్రజల సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు చేయడం లేదని రిపబ్లికన్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ వరదలు కూడా కీలక అంశంగా మారనున్నాయి.