US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అలజడి చోటుచేసుకుంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా చాలామంది ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఈవిధంగా ప్రజలు ఓట్లు వేసిన పలు బ్యాలెట్ బాక్సులకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. వాషింగ్టన్, ఒరెగాన్ పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒరెగాన్ పరిధిలోని బ్యాలెట్ బాక్సులకు కొంత నష్టం వాటిల్లగా.. వాషింగ్టన్‌లోని బ్యాలెట్ బాక్సులకు ఎటువంటి నష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒరెగాన్ పరిధిలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో మూడు బ్యాలెట్ బాక్సులకు దుండగులు నిప్పటించినట్లు తెలిసింది. ఉద్దేపూర్వకంగానే కొంతమంది ఈ దారుణానికి తెగబడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections) ప్రక్రియకు విఘాతం కలిగించే దురుద్దేశం కలిగిన వారు ఈ దుశ్చర్యకు తెగబడి ఉండొచ్చని చెప్పారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
Also Read :Diwali 2024: వైట్ హౌస్ నుంచి బైడెన్.. స్పేస్ నుంచి సునితా విలియమ్స్ దీపావళి సందేశాలు
ఈ ఘటన వల్ల బ్యాలెట్ బాక్సుల్లోని కొన్ని ఓట్లు కాలిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత పీడీటీలో ఓటు వేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. ఫినిక్స్‌లో గురువారం రోజు మెయిల్‌బాక్స్‌కు నిప్పంటించిన ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 20 బ్యాలెట్ బాక్సులు ధ్వంసమయ్యాయి. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో ఉన్నారు.
Also Read :Kerala Fire: కేరళలో భారీ అగ్నిప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు!
ఏమిటీ బ్యాలట్ డ్రాప్ బాక్సులు ?
ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కంటే దాదాపు 40 రోజుల ముందు నుంచే ‘ముందస్తు పోలింగ్’ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియను అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా ప్రజలు ఓట్లు వేసేందుకు బ్యాలట్ డ్రాప్ బాక్సులను ఎన్నికల కార్యాలయాలు, లైబ్రరీలు, ప్రభుత్వ భవనాల వద్ద ఏర్పాటు చేస్తారు. ప్రజలు అక్కడికి వెళ్లి తమ ఓటును నమోదు చేయొచ్చు. ట్యాంపర్ జరిగే అవకాశం లేకుండా అడ్వాన్స్‌డ్‌గా ఆ బాక్సులను తయారు చేయించారు. అయితే వీటిలో ట్యాంపరింగ్, రిగ్గింగ్ జరుగుతోందని గతంలో పలువురు అమెరికా కీలక నేతలు ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా బ్యాలట్ డ్రాప్ బాక్సుల ద్వారా ఓట్లను సేకరించే పద్దతిని వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ పాలిస్తున్న అర్కాన్సస్, మిసిసిప్పి, మిస్సోరి, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, సౌత్ డకోటాలలో బ్యాలట్ డ్రాప్ బాక్సుల వినియోగం 2020 సంవత్సరం నుంచే ఆగిపోయింది.