Hindu Man Dead: బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జెస్సోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో సోమవారం (జనవరి 5) మధ్యాహ్నం చోటుచేసుకుంది. 45 ఏళ్ల రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. పొరుగు దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందువులపై జరుగుతున్న దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాణా ప్రతాప్ బైరాగి హత్యతో కలిపి గత మూడు వారాల్లో బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై జరిగిన 5వ ప్రధాన దాడి ఇది. సమాచారం ప్రకారం.. రాణా ప్రతాప్‌పై ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రాణా ప్రతాప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారు ఎవరు? హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలు, ఉద్రిక్తతల మధ్య హిందూ మైనారిటీల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజివుల్లా ఖాన్ స్పందిస్తూ.. మేము ఘటనా స్థలంలో ఉన్నాము. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలిపారు.
Also Read: వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
ఖోకన్ చంద్ర దాస్‌పై కత్తులతో దాడి, సజీవ దహనం
దీనికి ముందు డిసెంబర్ 31, 2025న (కొత్త ఏడాది వేడుకల సందర్భంగా) షరియత్‌పూర్ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై దుండగుల గుంపు కత్తులతో దాడి చేసి, ఆపై ఆయనకు నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఢాకాలోని నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 3) ఉదయం మరణించారు.
