Asif Bashir : ఆసిఫ్ బషీర్.. మానవతా వైఖరితో అందరి మనసులను గెల్చుకున్నారు. పాకిస్తానీయుడే అయినప్పటికీ, భారతీయుల మన్ననలు కూడా ఆయనకు దక్కాయి. గతేడాది సౌదీ అరేబియాలోని మక్కాలో మండుటెండల నడుమ హజ్ యాత్ర జరుగుతున్న వేళ ఎంతోమంది ప్రాణాలను ఆసిఫ్ బషీర్ రక్షించారు. మక్కా పరిధిలో వేర్వేరుచోట్ల, వేర్వేరు దినాల్లో ఎండదెబ్బకు 26 మంది సొమ్మసిల్లి పడిపోయారు. వారందరినీ భుజాలపై ఎత్తుకొని మరీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించడంలో ఆసిఫ్ బషీర్ సహా పలువురితో కూడిన సహాయక టీమ్ కీలక పాత్ర పోషించింది. ఆ 26 మంది బాధితుల్లో 17 మంది భారత హజ్ యాత్రికులే ఉన్నారు. ఆసిఫ్ బషీర్ మక్కా పరిధిలోని మీనా ప్రాంతంలో హజ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి ప్రజల ప్రాణాలను నిలిపినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆసిఫ్ బషీర్‌కు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారే- ఇంతియాజ్’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ఆసిఫ్ బషీర్‌కు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ(Asif Bashir) బహూకరించారు.
Also Read :Gali Janardhan Reddy Vs Sriramulu: గాలి జనార్దన్‌రెడ్డి వర్సెస్ శ్రీరాములు.. ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ విమర్శల యుద్ధం
గతేడాది హజ్ యాత్రలో ఏం జరిగింది?
గతేడాది జరిగిన హజ్‌యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1300 మంది హజ్ యాత్రికులు చనిపోయారు. వీరిలో దాదాపు 120 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వివిధ దేశాల నుంచి కొందరు అక్రమ మార్గాల్లో సౌదీ అరేబియాకు చేరుకున్నారు. తక్కువ ఖర్చులో మక్కా నగరానికి చేరుకునే ప్రయత్నంలో.. కాలినడకన ఎడారుల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచారు. ఆ సమయంలో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో 54 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు సౌదీ ఎడారుల్లో నమోదయ్యాయి. ఈ ఎండల ధాటికి ఆ హజ్ యాత్రికులు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. మక్కాకు వెళ్లే మార్గం మధ్యలోనే చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అయినా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం పవిత్ర హజ్ యాత్ర వేళ విషాదాన్ని మిగిల్చింది.
పాకిస్తాన్‌కు సౌదీ మొట్టికాయలు
అధికారికంగా, అన్ని అనుమతులతో హజ్ యాత్రకు వచ్చేవారు కాలినడకన ఎడారుల మీదుగా నడవాల్సిన అవసరం ఉండదు. వారికి ఏసీ బస్సులు/వాహనాల సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అప్పట్లో పాకిస్తాన్ నుంచి పెద్దసంఖ్యలో అక్రమ మార్గాల్లో హజ్ యాత్రకు యాత్రికులు వచ్చినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తించింది. వారంతా భిక్షాటన ముసుగులో సౌదీలోని వివిధ పట్టణాల మీదుగా మక్కాకు చేరుకునేందుకు యత్నించారని విచారణలో వెల్లడైంది. ఈనేపథ్యంలో సౌదీ వీసాలకు దరఖాస్తు చేసేవారికి కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని పాకిస్తాన్ సర్కారుకు సౌదీ ప్రభుత్వం అప్పట్లో హితవు పలికింది.