Adiala Jail: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న అడియాలా జైలు వెలుపల అర్థరాత్రి భారీ నిరసనలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) మద్దతుదారులపై పంజాబ్ పోలీసులు కెమికల్ కలిపిన నీటిని వాటర్ కానన్ల ద్వారా ప్రయోగించారు. గడ్డకట్టే చలిలో పోలీసులు చేసిన ఈ చర్యతో నిరసనకారులు పూర్తిగా తడిసిపోయారు.
ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు, మద్దతుదారుల నిరసన
అడియాలా జైలు వెలుపల ఈ ప్రదర్శన శాంతియుతంగానే ప్రారంభమైంది. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, నొరీన్ ఖాన్ నియాజీలతో పాటు పీటీఐ నాయకులు, కార్యకర్తలు జైలు వెలుపల గుమిగూడారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుతం అనేక తీవ్రమైన కేసులు కొనసాగుతున్నాయి.
నిరసనకారులు జైలు వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో వాటర్ కానన్లను ఉపయోగించి అందరినీ చెదరగొట్టారు. “ఏ చట్టం ప్రకారం ఈ చర్య తీసుకున్నారు?” అని పీటీఐ పార్టీ ప్రశ్నించింది. శాంతియుత నిరసనలపై ఇటువంటి అణచివేత చర్యలను సహించబోమని పార్టీ పేర్కొంది.
Also Read: పీరియడ్స్ నొప్పిని ఖతం చేసే నాలుగు రకాల పానీయాలు.. ఎలా తాగాలో తెలుసా?
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
ఇస్లామాబాద్ హైకోర్టు మార్చి 2025లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌ను వారానికి రెండుసార్లు (మంగళవారం, గురువారం) కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలి. అయితే ఈ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదని పీటీఐ ఆరోపిస్తోంది. ఆ కోర్టు ఆదేశాలను అమలు చేయాలనే డిమాండ్‌తోనే ఈ నిరసన చేపట్టారు. మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలపై కెమికల్ కలిపిన నీటిని చల్లడమే కాకుండా, పలువురు కార్యకర్తలను కొట్టి, అదుపులోకి తీసుకున్నారని పీటీఐ ఆరోపించింది. ప్రభుత్వం, సైన్యం అణచివేతకు నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తుందని పార్టీ విమర్శించింది.
న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారు: అలీమా ఖాన్
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 2న తన సోదరి ఉజ్మా ఖాన్ ఇమ్రాన్‌తో జరిపిన సంభాషణను గుర్తు చేస్తూ ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను ఇరుకైన గదుల్లో ఉంచి మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
