ISI Vs Pak Leaders : పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ బలంగా వేళ్లూనుకుంటోంది. ఈమేరకు ఆ దేశ న్యాయశాఖ కీలక చట్ట సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం.. పాకిస్తాన్ రాజకీయ నాయకుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లపై కూడా నిఘా పెట్టే హక్కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు లభించింది. పాకిస్తాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నాయి. అదొక నల్ల చట్టం అని మండిపడుతున్నాయి. దీనిపై పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజామ్ నజీర్ వాదన మరోలా ఉంది. కేవలం క్రిమినల్స్, ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికే ఈ చట్టాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత కాల్స్‌పై నిఘా పెట్టాలనే ఆలోచన ఐఎస్ఐకు(ISI Vs Pak Leaders) లేదని అజామ్ నజీర్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ నాయకుడు ఒమర్ అయూబ్ ఖాన్ ఈ చట్టంపై మండిపడ్డారు. ఐఎస్ఐ లాంటి నిఘా సంస్థలు ఈ చట్టాన్ని రాజకీయ నాయకులపైనే వినియోగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. ఈ నల్లచట్టాన్ని ఎదిరించి ప్రజల మద్దతును కూడగడతామన్నారు. గతంలో ఇమ్రాన్‌ఖాన్ ఫోన్లు, కంప్యూటర్లపై ఐఎస్ఐ నిఘా పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read :NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్‌లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్‌టీఏ
పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ మాత్రం ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మిలిటెన్సీ హింసను రూపుమాపాలంటే ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల భయాలను ఆయన కొట్టిపారేశారు. గతంలో ఇమ్రాన్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు అనుకూలంగానే వ్యవహరించిందన్నారు.