Gaza Ground Attack : జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ ఎటాక్‌ను ముమ్మరం చేసింది. గత ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్‌కు యత్నించగా నలుగురు ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. ఈనేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అమెరికా సైనిక కమాండర్ల పర్యవేక్షణలో ఇప్పుడు మళ్లీ గాజాపై గ్రౌండ్ ఎటాక్‌ను ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. గాజాలోని హమాస్ సొరంగాలను సీజ్ చేయడమే ఈ గ్రౌండ్ ఆపరేషన్ టార్గెట్ అని ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. మరోవైపు హమాస్ కూడా ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్‌ను కన్ఫార్మ్ చేసింది. గాజాలోని ఈశాన్య పట్టణం బీట్ హనౌన్, అల్-బురీజ్ మధ్య ప్రాంతంలో తమ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల ఆర్మీ కాల్పులు జరుపుతోందని తెలిపింది. అల్-కస్సామ్ బ్రిగేడ్, అన్ని పాలస్తీనా నిరోధక దళాలు ఇజ్రాయెల్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయని హమాస్ చెప్పింది. నెతన్యాహు, ఇజ్రాయెల్ సైన్యం నైతికంగా ఇప్పటికే తమ చేతిలో ఓడిపోయిందని స్పష్టం చేసింది. అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు గాజాతో యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు 310 మంది ఇజ్రాయెల్ సైనికులు(Gaza Ground Attack) చనిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు గాజా ప్రజల సహాయం కోసం భారత సహా ప్రపంచ దేశాలు పంపిన దాదాపు 300 ట్రక్కులు ఈజిప్టు బార్డర్‌లో రెడీగా ఉన్నాయి. అయితే వీటిలో కేవలం ఆహార సామగ్రి ట్రక్కులను మాత్రమే లోపలికి పంపేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతిస్తోంది. ఇంధన ట్యాంకులను పంపితే.. వాటిని హమాస్ దుర్వినియోగం చేస్తుందని వాదిస్తోంది. ప్రతిరోజూ 20 ఆహార సామగ్రి ట్రక్కులు మాత్రమే గాజాలోకి వెళ్తున్నాయి. అవి తమకు సరిపోవని, రోజూ కనీసం 60 ట్రక్కుల సాయం అవసరమని స్థానిక అధికార యంత్రాంగం అంటోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ బాంబు దాడులలో ఇప్పటికే 7,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 20,000 ఇళ్లు గాజాలో నేలమట్టం అయ్యాయి.