Site icon HashtagU Telugu

Hamas Vs Israel : కాల్పుల విరమణకు సిద్ధమన్న హమాస్.. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్

Hamas Vs Israel Gaza Ceasefire

Hamas Vs Israel : కాల్పుల విరమణకు తాము రెడీ అని పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మరోసారి ప్రకటించింది.  వెంటనే గాజాలో కాల్పుల విరమణను అమలు చేస్తామంటే తాము తప్పకుండా సహకరిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు అమెరికా చేసిన ప్రతిపాదనకు అనుగుణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని తేల్చి చెప్పింది.  ఇతరుల ఒత్తిడికి తలొగ్గి అందులో కొత్త షరతులను(Hamas Vs Israel) చేర్చొద్దని కోరింది. ఈమేరకు హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా సారథ్యంలోని టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. దోహాలో  ఖతర్ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ, ఈజిప్ట్ ఇంటెలీజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్‌లతో జరిగిన సమావేశంలో ఈవిషయాన్ని హమాస్ ప్రతినిధులు తెలియజేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలకు అమెరికా, ఖతర్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read :Agencies Warning : రాజకీయ నాయకులు, భద్రతా బలగాలపై ఉగ్రదాడులు జరిగే ముప్పు : నిఘా వర్గాలు

కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలడెల్ఫీ కారిడార్ అంశం ప్రధాన ఆటంకంగా మారింది. ఈజిప్టు సమీపంలోని గాజా సరిహద్దు వద్ద ఉన్న చిన్న ప్రాంతాన్ని ఫిలడెల్ఫీ కారిడార్ అంటారు. దానిపై తమకు నియంత్రణ కావాలని ఇజ్రాయెల్ కోరుతోంది. అయితే ఆ ప్రతిపాదనను ఈజిప్ట్, హమాస్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసేందుకు రెడీగా లేదని తెలుస్తోంది.

Also Read :Vinesh Phogat Net Worth: వినేష్ ఫోగ‌ట్ ఆస్తి వివ‌రాలివే.. మూడు ల‌గ్జ‌రీ కార్ల‌తో పాటు విలువైన స్థ‌లాలు..!

మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి గాజాలోని ప్రజల గుడారాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 34 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 19 మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరుగురు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను ఐరాస  కూడా కన్ఫార్మ్ చేసింది. ఇలాంటి దాడులు చేశాక.. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని ప్రకటించడం ఇజ్రాయెల్‌కు ఒక రివాజుగా మారిపోయింది.