Site icon HashtagU Telugu

4000 Prisoners Escape : 4వేల మంది ఖైదీలు పరార్.. దేశంలో కర్ఫ్యూ

4000 Prisoners Escape

4000 Prisoners Escape

4000 Prisoners Escape : కరీబియన్‌ దేశం హైతీలో నేరగాళ్ల ముఠాలు చెలరేగాయి. రాజధాని నగరం ‘పోర్ట్‌ ఔ ప్రిన్స్‌’లో కలకలం క్రియేట్ చేశాయి. పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ నగరంలోని రెండు ప్రధాన జైళ్లపై  సాయుధ ముఠాలు దాడికి తెగబడ్డాయి. దీంతో వాటిలోని దాదాపు 4వేల మంది ఖైదీలు తప్పించుకొని పరారయ్యారు. రక్షణరంగ ఒప్పందం కోసం హైతీ ప్రధానమంత్రి ఏరియల్‌ హెన్రీ కెన్యా పర్యటనకు వెళ్లిన తరుణంలో నేరగాళ్ల ముఠాలు కలిసికట్టుగా జైళ్లపై దాడి చేసి ఖైదీలను విడిపించుకోవడం గమనార్హం.  ఈసందర్భంగా రాజధాని నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది.  లక్షలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. నగరంలో పలుచోట్ల  హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో 72 గంటల అత్యవసర ఎమర్జెన్సీని ప్రకటించారు. వాస్తవానికి శనివారం అర్ధరాత్రి నాటికే ఇదంతా జరిగిపోయింది. అంతర్జాతీయ మీడియా ద్వారా ఈవిషయం వెలుగులోకి రావడంలో చాలా ఆలస్యం జరిగింది. తాజా దాడుల వెనుక  ‘బాజ్‌-5’ ముఠా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. జైలుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

జైళ్ల నుంచి బయటికొస్తున్న ఖైదీలు రాజధాని నగరంలోని పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది.దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ నగరంలోని ప్రధాన జైలులో ఉంచుతుంటారు.  దేశాధ్యక్షుడి హంతకులతోపాటు  18మంది కొలంబియా వాసులు కూడా ఈ జైలులోనే ఉన్నారు. దీని సామర్థ్యం 3,900. అయినప్పటికీ ఇందులో 11,778 మందిని ఉంచుతున్నారు. ఆ జైలు ఎలా కిక్కిరిసిపోయి ఉంటుందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.  కెన్యాతో రక్షణ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు కూడా ఇకపై హైతీ రక్షణకు సాయం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ కీలక ప్రకటన చేశాడు. ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేట్లు చేస్తామని వెల్లడించాడు. పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాడు. నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ గతంలో పోలీస్‌ అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత గ్యాంగులతో సంబంధాలు పెట్టుకొని నేరగాడిగా మారాడు. అతడిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు హైతీకి విమాన సర్వీసులను రద్దు చేశాయి. హైతీలో ఉన్న అమెరికా పౌరులకు ఇప్పటికే ఆ దేశం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Agniveer – New Rules : అగ్నివీరుల జాబ్స్ భర్తీ .. 4 కొత్త రూల్స్