NASA Hacked : ఒక ఎథికల్ హ్యాకర్ వరుసగా రెండోసారి నాసా వెబ్‌సైట్లను హ్యాక్ చేశాడు. వాటిలోని సాంకేతిక లోటుపాట్లను ఆసరాగా చేసుకొని ఈ హ్యాకింగ్ చేశాడు. అయితే నాసా వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేసేందుకు తనకు ఉపయోగపడిన సాంకేతిక లోటుపాట్ల వివరాలను నాసాకు సదరు హ్యాకర్ పంపాడు. ఆయా లోటుపాట్లను సర్దుబాటు చేసుకుంటే.. నాసా వెబ్‌సైట్లను సురక్షితంగా మార్చుకోవచ్చని సూచించాడు. ఈ సమాచారాన్ని అందుకున్న నాసా సదరు హ్యాకర్‌ను అభినందించింది. ఆ హ్యాకర్‌ను అభినందిస్తూ నాసా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మార్క్ విట్(NASA Hacked) సంతకం చేసిన ఒక లేఖను హ్యాకర్‌కు పంపారు. నాసాకు చెందిన సమాచార సదుపాయాలను మరింత బలోపేతం చేసుకునేందుకు సదరు హ్యాకర్ అందించిన సమాచారం ఎంతో తోడ్పడుతుందని ఆ లేఖలో ప్రస్తావించారు. టెక్ సంస్థలు, ఎథికల్ హ్యాకర్లు కలిసికట్టుగా ముందుకుసాగితే సురక్షితమైన టెక్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం సాధ్యమవుతుందని నాసా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మార్క్ విట్ పేర్కొన్నారు.
Also Read :Hezbollah Unit 910 : రంగంలోకి హిజ్బుల్లా ‘యూనిట్ 910’.. ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్
నాసా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మార్క్ విట్ పంపిన లేఖను ఆ హ్యాకర్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ లేఖను పోస్ట్ చేస్తూ.. ‘‘నాసా పోర్టల్స్‌లోని సాంకేతిక లోపాలను గుర్తించి సమాచారం అందించినందుకు నాకు సంతోషంగా ఉంది. నాసా నన్ను అభినందించడం సంతోషకరం’’ అని హ్యాకర్ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఏకంగా నాసానే హ్యాక్ చేయడం చాలా గొప్పవిషయం’’ అని పేర్కొన్నారు. మొత్తం మీద హ్యాకర్ చేసిన పోస్టుకు ఇప్పటిదాకా దాదాపు 4.50 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈవిధంగా ఏదైనా వెబ్‌సైట్ లేదా పోర్టల్‌ను హ్యాక్ చేసి.. ఆ లోపాలను వాటి నిర్వాహకులకు తెలియజేయడాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. ఇలాంటి వారికి మార్కెట్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నారు. ఈ సమాచారాన్ని అందించినందుకు భారీగా డబ్బు కూడా ఇస్తుంటారు.