మెక్సికోలో మరోసారి భారీ కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో దాదాపు 12 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి కాల్పులు జరగడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సెప్టెంబర్ 21న జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.
శనివారం సాయంత్రం సెంట్రల్ మెక్సికోలోని ఒక బార్‌లో కాల్పులు జరిపిన దుండగుల కోసం మెక్సికన్ అధికారులు వెతుకుతున్నారు. సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలోని ఇరాపువాటో నగరంలోని బార్‌లో రాత్రి 8 గంటల సమయంలో తుపాకీ కాల్పులు జరిగినట్లు నగర పౌర భద్రత కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పారామెడిక్స్ ప్రకటన ప్రకారం.. మృతి చెందిన 12 మందిలో ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళల ఉన్నట్లు ధృవీకరించారు. బాధితులు ఎవరు, ఎంతమంది దుండగులు కాల్పుల్లో పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేదు.
రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018 చివరిలో అధికారం చేపట్టినప్పటి నుండి ఇలాంటి దాడులను ఆపడానికి పటిష్ట చర్యలు తీసుకున్నారు. అయితే.. మెక్సికోలో ఇటీవల తుపాకీ దాడులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోసారి కావడం విశేషం.