Site icon HashtagU Telugu

8 Killed : సెర్బియా రాజధాని సమీపంలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం.. 8 మంది మృతి

Gun

Gun

సెర్బియా రాజ‌ధాని స‌మీపంలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) రాజధాని బెల్‌గ్రేడ్ సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల అనుమానితుడు కాల్పులు జరిపిన‌ట్లు స‌మాచారం. . ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతి చెంద‌గా.. మ‌రో 10 మంది గాయ‌ప‌డ్డారు. గత రెండు రోజుల్లో సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండోసారి. అనుమానితుడు ఆటోమేటిక్ ఆయుధాన్ని ఉపయోగించాడని.. బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్లాడెనోవాక్ సమీపంలో ఉన్న వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం పారిపోయిన దుండగుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ప్రకటనలు విడుదల చేయలేదు.

బుధవారం వ్లాడిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీలను ఉపయోగించి కాల్పులు జరపడంతో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులు, ఒక గార్డు మరణించారు. ఈ కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆరుగురు పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. వెన్నెముక గాయాల కారణంగా ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉండగా, తలపై బుల్లెట్ గాయ‌మైన ఒక విద్యార్థిని ప‌రిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. షూటర్‌ను కోస్టా కెక్‌మనోవిచ్‌గా పోలీసులు గుర్తించారు. దుండ‌గుడు కెక్‌మనోవిక్ పాఠశాలలోకి ప్రవేశించాడని.. మొదట గార్డును, ముగ్గురు విద్యార్థులను హాలులో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఆ త‌రువాత వేరే త‌ర‌గ‌తి గ‌దిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులపై కాల్పులు జ‌రిపాడు.