హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ శుభవార్త: గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగం

వచ్చే ఏడాది నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్‌-1బీ ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపినట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Google has good news for H-1B employees: Green card process is speeding up

Google has good news for H-1B employees: Green card process is speeding up

. 2026 నుంచి PERM దరఖాస్తులకు ప్రాధాన్యం

. లేఆఫ్‌ల ప్రభావం..ఇప్పుడు మారుతున్న పరిస్థితి

. అర్హతలు, షరతులు ఇవే

H-1B – Google: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ కీలక ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్‌-1బీ ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఉద్యోగులకు అంతర్గత న్యూస్‌లెటర్ ద్వారా తెలియజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో కీలకమైన PERM (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) దరఖాస్తులను 2026లో వేగంగా ప్రాసెస్ చేయాలని గూగుల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత సాధించిన ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే ఇమిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి సంప్రదింపులు ప్రారంభమవుతాయని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళికపై గూగుల్‌ ఇప్పటివరకు బహిరంగ ప్రకటన మాత్రం చేయలేదు.

H1b Visa

ట్రంప్‌  కఠిన వలస విధానాలు, వీసా ఫీజుల పెరుగుదల, సోషల్‌ మీడియా వెట్టింగ్‌ వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం హెచ్‌-1బీ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. చాలా కాలంగా గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. PERM ప్రక్రియలో కంపెనీలు అనేక షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా కార్మికులపై ప్రతికూల ప్రభావం ఉండదని, అలాగే ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని నిరూపించాల్సి ఉంటుంది. లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ నిబంధనలను సమర్థించుకోవడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. 2023 జనవరిలో గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో PERM దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అదే బాటలో అమెజాన్‌, మెటా వంటి సంస్థలు కూడా వ్యవహరించాయి. గత ఏడాదిలో గూగుల్‌ చాలా పరిమిత సంఖ్యలోనే PERM దరఖాస్తులు దాఖలు చేసింది.

అయితే పరిస్థితులు మెరుగుపడడంతో 2026 నుంచి ఈ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, గూగుల్‌లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగికి ఈ అవకాశం లభించదు. PERM అర్హత కోసం కంపెనీ స్పష్టమైన ప్రమాణాలు పెట్టింది. ఉద్యోగి విద్యార్హతలతో పాటు పని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు, గూగుల్‌ కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. రిమోట్‌గా పనిచేస్తున్న వారు PERM అర్హత పొందాలంటే తప్పనిసరిగా తమ నివాస ప్రాంతాన్ని మార్చుకుని ఆఫీస్‌కు హాజరయ్యే విధంగా మారాల్సి ఉంటుంది.
ఇక, ఉద్యోగి సీనియార్టీ, పనితీరు, సంస్థలో వారి పాత్ర కూడా కీలకంగా ఉంటాయని అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, అమెరికాలో స్థిరపడాలనే ఆశతో ఉన్న హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ నిర్ణయం కొత్త ఆశాకిరణంగా మారిందని చెప్పవచ్చు.

 

 

  Last Updated: 23 Dec 2025, 07:59 PM IST