Google Layoffs: మరి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్న గూగుల్.. సంకేతం ఇచ్చిన సుందర్ పిచాయ్ ?

ప్రస్తుతం ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్‌ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 05:08 PM IST

ప్రస్తుతం ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్‌ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటికే టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భాగంగానే ఇప్పటికే గూగుల్ సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదు అంటుంది గూగుల్ సంస్థ.

అయితే గూగుల్ సంస్థ 12,000 మంది ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేసినప్పటికీ ఇంకా పరిస్థితులు చక్కబడినట్టు కనిపించడం లేదు. దాంతో మరింత మంది ఉద్యోగులను తీసేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఉద్యోగులను తొలగించే దిశలో సంకేతాలను ఇచ్చారు. ఈ సందర్బంగా పిచాయ్ మాట్లాడుతూ… కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు పిచాయ్ వెల్లడించారు. వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని తెలిపారు.

ప్రస్తుతం వారు అందులో ఉన్న అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నట్లు పిచాయ్ తెలిపారు. కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఖర్చులను పునఃసమీక్షించేందుకు కృషి చేస్తున్నాని ఆయన అన్నారు. ఫలితంగా కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే పిచాయ్ మాటలను బట్టి చూస్తే త్వరలో గూగుల్‌ మరికొంత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తొలగించిన ఆ 12,000 మందిలో 450 మంది మన భారతదేశానికి చెందిన వారు కూడా ఉన్నారు.