Site icon HashtagU Telugu

Israel Vs Gaza : ఇజ్రాయెలీ బందీలను వదలాలంటే.. ఆ ఒక్కదానికి ఒప్పుకోండి : హమాస్

Israel Vs Gaza

Israel Vs Gaza

Israel Vs Gaza : అక్టోబరు 7 నుంచి తమ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన విడుదల చేసింది. సంపూర్ణ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెబితేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. గాజాపై జరుగుతున్న దాడుల్ని ఆపేసి..  సంపూర్ణ కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌కు అల్టిమేటం ఇచ్చింది. ‘‘గాజా పునర్నిర్మాణాన్ని మళ్లీ మొదలుపెట్టాలి. ఇజ్రాయెల్‌ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేసింది. అయితే ఈ హెచ్చరికను అంగీకరించేందుకు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవడం లేదు. దీంతో యుద్ధం కారణంగా అలుముకున్న సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు దరిదాపుల్లో  కనిపించడం లేదు. హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెలీల విడుదల కోసం అమెరికా, ఖతార్‌ దేశాలు చర్చలు జరుపుతున్న ప్రస్తుత తరుణంలో హమాస్ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు గాజా భూభాగంలోని 246 చ.కి.మీల ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. గాజా మొత్తం జనాభా 23 లక్షలు. వీరిలో  దాదాపు 17 లక్షల మందిని ఇళ్లు ఖాళీ చేయించి.. ఈజిప్టు బార్డర్‌కు పంపించాలని ఇజ్రాయెల్ స్కెచ్ గీస్తోంది. తద్వారా తమ దేశ సరిహద్దు ప్రాంతంలో మనుషులు తిరగని పెద్ద బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. క్రమంగా అక్కడ యూదు జాతీయులతో కాలనీలను ఏర్పాటుచేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈనేపథ్యంలో ఇజ్రాయెల్ పొరుగుదేశం ఈజిప్టు అలర్ట్ అయింది. తమ దేశ సరిహద్దు ప్రాంతానికి 17 లక్షల మంది గాజా ప్రజలను పంపించేందుకు ఇజ్రాయెల్ యత్నిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన శాంతి ఒప్పందానికి విఘాతం కలుగుతుందని ఈజిప్టు(Israel Vs Gaza) వెల్లడించింది.

Also Read : RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన అమానవీయ దాడుల వల్ల లక్షలాది మంది పాలస్తీనా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వీరంతా శరణార్థుల శిబిరాలతో పాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల దయనీయ స్థితిని తెలియజేసే విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు శ్మశాన వాటికల్లోనే శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా తల దాచుకునేందుకు పోటీ పడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులను మీడియాకు వివరిస్తూ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.   ఆశ్రయం పొందడానికి శిబిరాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల తమ కుటుంబాలతో కలిసి శ్మశానంలోని సమాధుల మధ్యే నివస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సరైన ఆహారం, నీరు దొరక్క గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అంటున్నాయి.