Site icon HashtagU Telugu

Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

Funding for Khalistani terrorists comes from Canada: Canadian report reveals..!

Funding for Khalistani terrorists comes from Canada: Canadian report reveals..!

Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడా వేదికగా భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న భారత ప్రభుత్వ ఆరోపణలకు తాజా అంతర్జాతీయ ధృవీకరణ లభించింది. కెనడా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన “2025 అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ అండ్‌ టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌ ఇన్‌ కెనడా” అనే నివేదికలో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, బబ్బర్‌ ఖాళ్సా ఇంటర్నేషనల్‌ మరియు ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌ అనే రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలు కెనడా నుంచే నిధులను సమకూర్చుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ నిధులు రకరకాల మార్గాల్లో ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ కార్యక్రమాల పేరు మీద సేకరించబడుతున్నాయని అధికారులు గుర్తించారు.

రాజకీయ ప్రేరణతో కూడిన హింసాత్మక ఉగ్రవాదం పెరుగుదల

కెనడాలో రాజకీయ ప్రేరిత హింసాత్మక ఉగ్రవాదం (Politically Motivated Violent Extremism – PMVE) కేటగిరీలో ఖలిస్థానీ మూకలు, హమాస్‌, హెజ్‌బొల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు కీలకంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఖలిస్థానీ గుంపులు పంజాబ్‌లో స్వతంత్ర దేశాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో హింసాత్మక మార్గాలను ఎంచుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు వీరు కెనడా, బ్రిటన్‌, అమెరికా వంటి దేశాల్లో తమ మద్దతుదారుల ద్వారా నిధులు సేకరించే నెట్‌వర్క్‌ను నెలకొల్పారని, గతంలో కంటే ఇప్పుడు ఈ నెట్‌వర్క్ మరింత పరిమితమై, కొన్ని వ్యక్తులపైనే ఆధారపడుతోందని నివేదిక వెల్లడించింది.

స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల దుర్వినియోగం

హమాస్‌, హెజ్‌బొల్లా వంటి సంస్థలు చారిటబుల్‌ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల పేరుతో నిధులను సేకరించడం ప్రధాన మార్గంగా ఉపయోగించుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఖలిస్థానీ ఉగ్ర మూకలు కూడా ఇదే విధానాన్ని అనుసరించి, తమ కమ్యూనిటీ కార్యకలాపాల పేరుతో నిధులను సమకూర్చుతున్నాయి. అయితే, ఈ మార్గాల ద్వారా వచ్చే డబ్బు పరిమితంగా ఉన్నప్పటికీ, దీనికి వెనుక ఉన్న ముప్పు చాలా పెద్దదని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా కెనడాలో మనీలాండరింగ్‌ ముప్పు ఎక్కువగా ఉందని, ఇది దేశ భద్రతకు గణనీయమైన సవాలుగా మారుతుందన్న విశ్లేషణను వెల్లడించింది.

కెనడా అంగీకారంతో భారత్‌కు మద్దతు

ఇదిలా ఉండగా, 2025లో కెనడా పార్లమెంట్‌ మద్దతుతో వచ్చిన ఓ నివేదికలో కూడా ఖలిస్థానీ ఉగ్రవాదులు తమ దేశ భూభాగాన్ని ఉపయోగించి కుట్రలు పన్నుతున్నారన్న విషయాన్ని కెనడా అధికారులు అంగీకరించారు. జూన్‌ నెలలో ఈ అంశంపై సుప్రీం స్థాయి అధికారుల నివేదిక వెలుగులోకి వచ్చింది.

భారత్‌ ఏమంటోంది?

భారత ప్రభుత్వం ఇప్పటికే కెనడాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. “ఉగ్రవాదానికి ఆధారంగా మారిన దేశం”గా కెనడాను అభివర్ణిస్తూ, ఖలిస్థానీ మద్దతుదారులకు అక్కడ రాజకీయ ప్రోత్సాహం ఉన్నట్లు ఆరోపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ కెనడియన్‌ ప్రభుత్వ నివేదిక మాత్రం భారత్‌ ఆరోపణలను సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Read Also: Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!