France Elections : మాక్రాన్‌కు షాక్.. ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన ఫలితం

ఆదివారం రోజు జరిగిన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 11:56 AM IST

France Elections : ఆదివారం రోజు జరిగిన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కడపటి సమాచారం అందే సమయానికి ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీ వెనుకంజలో ఉండిపోయింది. ఇటీవలే యూరోపియన్ యూనియన్ ఎన్నికలలోనూ సెంట్రిస్ట్ పార్టీ ఓడిపోయింది. దీంతో తమ దేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జూన్ 9న ప్రకటించారు. ఈక్రమంలోనే జూన్ 30వ తేదీన ఫ్రాన్స్‌లో పోలింగ్ నిర్వహించారు. ఇందులోనూ ఘోర ఓటమి దిశగా మాక్రాన్ పయనిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఓట్ల లెక్కింపు తొలి రౌండులో మాక్రాన్‌కు చెందిన రాజకీయ కూటమి కేవలం 20.7 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక వామపక్ష పార్టీల కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28.1 శాతం ఓట్లను  సాధించింది. ఇక నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని  రైటిస్ట్ కూటమి అత్యధికంగా 33.5 శాతం ఓట్లను దక్కించుకుంది. 2022 సంవత్సరంలో జరిగిన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే రైటిస్ట్ కూటమి సాధించిన ఓట్లు డబుల్ అయ్యాయి.  మూడు వారాల హడావుడి ప్రచారంలో ఫ్రాన్స్ దేశ ప్రజలను మాక్రాన్ తన వైపునకు తిప్పుకోలేకపోయారని.. ఆయన ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితం  రూపంలో బయటపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read :KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

ఫ్రాన్స్ తదుపరి ప్రధాని ఎవరు?

ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తుండటంపై నేషనల్ ర్యాలీ పార్టీ అధ్యక్షుడు 28 ఏళ్ల జోర్డాన్ బర్దెల్లా హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తే తాను ప్రధానమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం లేదని  బర్దెల్లా స్పష్టం చేశారు. మాక్రాన్ పార్టీతో కానీ..  వామపక్ష కూటమి ఎన్‌ఎఫ్‌పీతో కూడా పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

Also Read :Weight Loss: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయాన్నే ఇలా చేయాల్సిందే?