Moscow Terror Attack : డబ్బు కోసమే మాస్కో‌పై ఎటాక్.. కోర్టులో ఒప్పుకున్న ఉగ్రవాదులు

Moscow Terror Attack : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌పై గత గురువారం రాత్రి దాడి చేసి 150 మందిని చంపిన నలుగురు ఉగ్రవాదులు కీలక ప్రకటన చేశారు. 

  • Written By:
  • Updated On - March 26, 2024 / 08:58 AM IST

Moscow Terror Attack : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌పై గత గురువారం రాత్రి దాడి చేసి 150 మందిని చంపిన నలుగురు ఉగ్రవాదులు కీలక ప్రకటన చేశారు.  సోమవారం వారిని వీల్ ఛైర్లలో కూర్చోబెట్టి మాస్కోలోని బాస్మనీ జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఉగ్రదాడి గురించి న్యాయమూర్తి వారిని వివరాలు అడగగా.. డబ్బుల కోసమే తాము ఉగ్రదాడి చేశామని ఒప్పుకున్నారు. గాయాలతో ఉన్న ముగ్గురూ నేరాన్ని అంగీకరించగా.. నాలుగో వాడు మాట్లాడలేని స్థితిలో కనిపించాడు. ఉగ్రవాదుల్లో ఒకడికి చెవిని పూర్తిగా కోసేసి తీవ్రగాయాలతో ఉండటం గమనార్హం. వారికి కరెంట్‌ షాక్‌ సహా చిత్రహింసలకు గురిచేసి ఉంటారని తెలుస్తోంది. వారిని రష్యా-బెలారస్‌ సరిహద్దులోని ఓ ప్రాంతంలో బంధించి విచారించారని సమాచారం. ఈ నలుగురు ఉగ్రవాదులకు కోర్టు మే 22 వరకూ పోలీసు కస్టడీ విధించింది. ఉగ్రవాదులంతా తజికిస్థాన్‌ పౌరులని.. వారి పేర్లు దలెర్ద్‌జొన్‌ మిర్జొయెవ్‌ (32), సైదక్రామి రచబలిజొద (30), షంసిదున్‌ ఫరీదుని (25), ముఖమ్మద్‌సొబిర్‌ ఫైజొవ్‌‌ (19) అని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న మరో ఏడుగురు ఇంకా రష్యా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. వారిని ఇప్పటివరకు కోర్టు ఎదుట ప్రవేశపెట్టలేదు. వారి నుంచి కూడా రష్యా భద్రతా సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

దాడికి ఐసిస్‌ను ప్రేరేపించింది అమెరికానే : రష్యా

కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులంతా ఉక్రెయిన్‌ వైపు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో, వారి కోసం అక్కడ ఎవరు నిరీక్షిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు.తాజాగా రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ.. ‘‘ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధంలో నిమగ్నమై ఉన్న రష్యాను దెబ్బతీసే దురుద్దేశంతో అమెరికాయే ఈ దాడికి ఐసిస్‌ను ప్రేరేపించింది. ఐసిస్ అమెరికా చేతిలో కీలుబొమ్మ. 1980వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని రష్యా సైన్యంపై పోరాడేందుకు ముజాహిదీన్లకు ఆయుధ సాయం చేసింది అమెరికాయే కదా ?’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. ‘‘ఏదైనా అంశంపై విచారణ కొనసాగుతున్నప్పుడు దాని గురించి చర్చించుకోవడం సరికాదు. ఈ దాడి చేసింది ఎవరనేది దర్యాప్తులో తేలుతుంది. మాస్కోపై ఎటాక్ చేసింది ఐసిసే అని మేం ఇప్పుడే చెప్పలేం. అమెరికా ఇంటెలీజెన్స్‌ ఆధారంగా మేం ఒక నిర్ధారణకు రాలేం. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని స్పష్టం చేశారు.