Jimmy Carter : జిమ్మీ కార్టర్ ఇక లేరు. ఒకప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఆరోగ్య సమస్యలతో 100 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఆయన కన్నుమూశారు. ఈవిషయాన్ని జిమ్మీ కార్టర్ కుమారుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 వెల్లడించారు. ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్ కొనియాడారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Jimmy Carter) సంతాపం తెలిపారు. కార్టర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైట్‌హౌస్ తెలిపింది.
Also Read :Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎంతో దిల్ రాజు మీటింగ్..!
కార్టర్ గురించి..
- జిమ్మీ కార్టర్ 1924 అక్టోబరు 1న జన్మించారు.
- కార్టర్ ఈ సంవత్సరమే తన 100వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
- ఆయన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జన్మించారు.
- జిమ్మీ కార్టర్ 1946 జూన్‌లో అమెరికా నావల్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశారు.
- 1946 జులైలో ఆయన రోసాలిన్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు.
- 1946 నుంచి 1953 మధ్యకాలంలో అమెరికా నేవీ న్యూక్లియర్ సబ్ మెరైన్ ప్రోగ్రాంలో జిమ్మీ కార్టర్ పనిచేశారు. అక్కడ ఆయనకు లెఫ్టినెంట్ కమాండర్ హోదా లభించింది.
- 1953లో అమెరికా నేవీలోని తన పదవికి కార్టర్ రాజీనామా చేశారు.
- 1953 నుంచి 1971 మధ్యకాలంలో కార్టర్ వ్యవసాయం చేశారు. గిడ్డంగుల బిజినెస్ నడిపారు.
- 1963 నుంచి 1966 మధ్యకాలంలో జార్జియా రాష్ట్ర సెనేట్‌కు కార్టర్ ఎన్నికయ్యారు.
- 1966లో జార్జియా గవర్నర్ ఎన్నికల నామినేషన్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.
- 1970లో జార్జియా గవర్నర్‌గా కార్టర్ ఎన్నికయ్యారు. 1971 నుంచి 1975 మధ్యకాలంలో ఆయన గవర్నర్‌గా సేవలు అందించారు.
- 1974 డిసెంబరు 12న అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని కార్టర్ ప్రకటించారు.
- అయితే కార్టర్ 1977లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
- 1977-1981 మధ్య కాలంలో అమెరికాకు 39వ అధ్యక్షుడిగా కార్టర్ సేవలు అందించారు.
- అమెరికాలో రైతుగా, నేవీ ఉద్యోగిగా, రాష్ట్ర గవర్నర్‌గా, దేశ అధ్యక్షుడిగా వివిధ రకాల బాధ్యతలను కార్టర్ నిర్వర్తించారు.
- మానవతావాద స్థాపన కోసం కార్టర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకే 2002 సంవత్సరంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు.
- క్యాన్సర్ వ్యాధిని జయించి 100 ఏళ్ల పాటు జీవించిన రికార్డు కార్టర్ సొంతం.
- అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లు బతికిన తొలి వ్యక్తి కార్టర్ మాత్రమే.
- 1978లో భారత్ పర్యటనకు జిమ్మీ కార్టర్ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఒక గ్రామానికి కార్టర్‌పురి అని పేరు పెట్టారు.