పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Former Minister), అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్) అధినేత షేక్ రషీద్‌ను గురువారం (ఫిబ్రవరి 2) అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. అతన్ని రావల్పిండిలో అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ను ఆ దేశ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆయన నుంచి మద్యం బాటిల్, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీను హత్య చేసేందుకు పథకం పన్నారని ఆబ్పారా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిని అరెస్టు చేశారు. అయితే తనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, తన అరెస్టు వెనుక ప్రస్తుత అంతర్గత మంత్రి రాణా సనావుల్లా పాత్ర ఉందని అహ్మద్ ఆరోపించారు.
షేక్ రషీద్ పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. షేక్ రషీద్ అరెస్టుపై షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పీటీఐ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. షేక్ రషీద్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశ చరిత్రలో ఇంత అప్రతిష్ట, పక్షపాతం, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు.
Also Read: US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో సోదాలు
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి కూడా షేక్ రషీద్ అరెస్టును తీవ్రంగా విమర్శించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “విఫలమైన పాలకుల సమూహం ఎన్నికలను తప్పించుకోవడానికి చెత్త వ్యూహాలను అవలంబించింది. ప్రజల ముందుకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫవాద్ చౌదరి నిన్న రాత్రి విడుదలయ్యాడు. ఫవాద్‌తో పాటు పలువురు నేతల అరెస్ట్ తర్వాత ఇప్పుడు బడా రాజకీయ నాయకుడు షేక్ రషీద్ అరెస్ట్ కూడా ప్రభుత్వ చౌకబారు రాజకీయాలలో భాగమే అని అన్నారు.