Strava App : అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ యాప్ ‘స్ట్రావా’పై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం ప్రచురితం అయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్, ఇతర ప్రపంచ నేతల లొకేషన్ ఫిట్‌నెస్ యాప్ స్ట్రావాతో తెలిసిపోతుందని ఆ కథనంలో ప్రస్తావించారు. వారి బాడీగార్డులు ఈ యాప్‌ను వాడుతుంటారని కథనంలో పేర్కొన్నారు. అమెరికా ఒక్కటే కాదు.. చాలా ఐరోపా దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతల సెక్యూరిటీ టీమ్‌లు స్ట్రావా యాప్‌ను వాడుతుంటాయని వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ సిబ్బంది సైతం దీన్ని వాడుతుంటారట. అయితేే ఈవిధంగా ప్రభుత్వాల అధినేతల కదలికలను ట్రాక్ చేయడం వల్ల భద్రతాపరమైన ఉల్లంఘనలకు దారితీయొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read :US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలజడి.. బ్యాలట్ డ్రాప్ బాక్సులకు నిప్పు
ఈ కథనంపై అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ(Strava App) స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. విధుల్లో ఉన్నప్పుడు తమ సిబ్బంది వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించరని తేల్చి చెప్పింది. విధుల్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ వర్క్‌కు అవసరమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను మాత్రమే తమ సిబ్బంది వాడుతుంటారని వెల్లడించింది. డ్యూటీలో లేనప్పుడు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడాలి అనే దానిపై మార్గదర్శకాలేవీ లేవని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై ఏవైనా కొత్త మార్గదర్శకాలు అవసరమా ? లేదా ? అనే దానిపై సమీక్షిస్తామని తెలిపింది.
Also Read :Bal Sant Vs Lawrence : పదేళ్ల బాల సాధువుకు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు.. ఎందుకు ?
- 2021 సంవత్సరంలో ఒకరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ నార్మండీ రిసార్ట్‌లో సేదతీరారు. బాడీగార్డులు స్ట్రావా యాప్‌ను వాడటంతో మెక్రాన్ లొకేషన్ వివరాలు బయటికొచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి.
- ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఎక్కడున్నారు అనేది వారి బాడీగార్డుల స్ట్రావా ప్రొఫైల్‌ను ట్రాక్ చేస్తే తెలిసిపోతుందని ఆ కథనాలలో ప్రస్తావించారు.
- దేశాధ్యక్షుల భద్రతా టీమ్‌లకు బాధ్యత వహించే 26 మంది అమెరికన్లు, 12 మంది ఫ్రాన్స్ పౌరులు, ఆరుగురు రష్యన్ల వివరాలు బయటికి వచ్చాయని కథనాలలో తెలిపారు.
- దేశాధినేతలు, ప్రభుత్వాల అధినేతలు ఎక్కడికైనా పర్యటనకు వెళితే.. తొలుత వారి సెక్యూరిటీ టీమ్‌లు సదరు ప్రదేశాల్లో రెక్కీ నిర్వహిస్తాయి. అంతా సేఫ్‌గానే ఉందని గుర్తించాక, అక్కడ పర్యటించేందుకు అనుమతి ఇస్తాయి. ఈక్రమంలోనే సెక్యూరిటీ టీమ్‌లు వినియోగించే స్ట్రావా యాప్ వల్ల లొకేషన్లు లీకవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.