Site icon HashtagU Telugu

Moon Lander : చంద్రుడిపైకి రూ.898 కోట్ల ల్యాండర్.. 50 ఏళ్ల తర్వాత ఎంట్రీ

Moon Lander

Moon Lander

Moon Lander : అగ్రరాజ్యం అమెరికా ఏది చేసినా సంచలనమే. చందమామపైకి మరోసారి మనుషులను పంపేందుకు అమెరికా రెడీ అవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున ‘పెరిగ్రీన్‌’ అనే పేరు కలిగిన లూనార్‌ ల్యాండర్‌ను నాసా ప్రయోగించింది. చందమామపైకి అమెరికా ల్యాండర్‌ను పంపించడం 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. అయితే ఈ ల్యాండర్‌ను నాసా తయారు చేయలేదు. ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేటు కంపెనీ డెవలప్ చేసింది.ఫ్లోరిడాలోని ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్‌ లాంచ్‌ అలయన్స్‌కు చెందిన ‘వల్కన్‌’ రాకెట్‌ ఈ ల్యాండర్‌‌తో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ల్యాండర్ ఫిబ్రవరి 23న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెరిగ్రీన్‌ ల్యాండర్‌ పలు సైంటిఫిక్‌ పరికరాలను మోసుకెళ్లింది. జాబిల్లి ఉపరితలంపై ఇవి అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు పంపించనున్నాయి. ఆర్టెమిస్‌-2 మిషన్‌కు ఇది కీలకం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆర్టెమిస్‌-2 ప్రయోగంతో మరో నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. లూనార్‌ ల్యాండర్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇటీవల రెండు కంపెనీలకు అమెరికా ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చింది. పెరిగ్రీన్‌ ల్యాండర్‌ తయారీ కోసం రూ.898 కోట్లకు ఆస్ట్రోబోటిక్‌ కంపెనీకి(Moon Lander) ఆర్డర్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రుడిపైకి అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా ఆస్ట్రోబోటిక్‌ నిలువనుంది. అయితే, అంతకంటే ముందుగానే మరో కంపెనీ ఈ ఘనత సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ కంపెనీ త్వరలోనే మరో ల్యాండర్‌‌ను ప్రయోగించనుంది. ఇది చంద్రుడిపైకి నేరుగా మరో షార్ట్ కట్ రూట్‌లో వెళ్లనుంది. ఇవాళ ప్రయోగించిన పెరిగ్రీన్‌ ల్యాండర్‌ మాత్రం కక్ష్యలన్నీ తిరుగుతూ చంద్రుడికి చేరుతుంది. ఇక ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన నోవా-సి ల్యాండర్‌ను ఫిబ్రవరి ఆరంభంలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. కేవలం వారంలోనే చంద్రుడిపైకి అడుగుపెట్టేలా ఈ ప్రయోగం జరగనుండటం విశేషం. ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా టెక్నాలజీ కంపెనీలు ల్యాండర్ల తయారీలో ఎంతమేర పురోగతి సాధించాయనే విషయం ఇప్పుడు లేటెస్టుగా జరగనున్న ప్రయోగాలతో తేలిపోతుంది. 1969 సంవత్సరంలో ‘అపోలో 11’ రాకెట్‌లో వెళ్లిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బుజ్‌ ఆల్డ్రిన్‌, మైఖేల్‌ కాలిన్స్‌ చంద్రుడిపైకి అడుగుపెట్టారు. 1972 వరకు ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు, పలు సార్లు మెషిన్‌ ల్యాండర్లను నాసా పంపించింది.

Also Read: Bomb Blast : పోలియో వ్యాన్‌పై బాంబుదాడి.. ఆరుగురు పోలీసులు మృతి