Iran crisis: ఇరాన్ జైల్లో అగ్నిప్రమాదం..నలుగురు మృతి ..61మంది గాయాలు..!!

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఎవన్ జైలులో శనివారం ఘోరఅగ్నిప్రమాదం జరిగింది.

  • Written By:
  • Publish Date - October 16, 2022 / 07:49 PM IST

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఎవన్ జైలులో శనివారం ఘోరఅగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 61మంది తీవ్రంగా గాయపడ్డారు. జైలులో కొంతమంది ఖైదీల మధ్య వాగ్వాదం కారణంగా మంటలు చెలరేగాయని వార్తా సంస్థ IRNAవెల్లడించింది. అయితే మంటలు చెలరేగడంతో భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కాగా ఈ జైల్లో ఎంతో మంది రాజకీయ, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవాళ్లు ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ జైలు 2018 నుంచి యుఎస్ బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే అగ్నిప్రమాదం సంభవించినప్పుడు పొగతో ఊపిరాడక నలుగురు ఖైదీలు మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని…అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది.

జైల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో సామాన్యులతోపాటు ఆందోళనకారులు జైలు వద్దకు బారులు తీరారు. ఇరాన్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. ఇరాన్ ప్రభుత్వ అణచివేత వైఖరికి నిరసనకారుల ధైర్యం చూసి ఆశ్చర్యపోయానన్నారు. దీనిపై ఇరాన్ దేశీయ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చకూడదంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.