Felix Baumgartner : స్కైడైవింగ్ ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిన ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ (56) దురదృష్టకర మరణం అభిమానులను కలచివేసింది. ఇటలీ తూర్పు తీరంలోని పోర్టో సాంట్ ఎల్పిడియో నగరంలో గురువారం పారాగ్లైడింగ్ చేస్తూ జరిగిన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఈ విషాదాన్ని నగర మేయర్ మాసిమిలియానో సియార్పెల్లా సోషల్ మీడియాలో ధృవీకరిస్తూ, “ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సాహసవీరుడి మరణం బాధాకరం” అని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది వివరాల ప్రకారం, ఒక ఈత కొలను సమీపంలో బామ్‌గార్ట్‌నర్ ప్రయాణిస్తున్న పారాగ్లైడర్ ఆకస్మికంగా కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
2012లో చరిత్ర సృష్టించిన సాహసగాథ
ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ పేరు వినగానే ప్రపంచానికి గుర్తొచ్చేది 2012 అక్టోబర్ 14న చేసిన ఆ అద్భుత సాహసం. అమెరికా న్యూ మెక్సికోలోని రోస్‌వెల్ ప్రాంతం నుంచి భూమికి 24 మైళ్లు (38 కి.మీ) ఎత్తులో బెలూన్ ద్వారా చేరుకుని, ప్రత్యేకంగా రూపకల్పన చేసిన సూట్ ధరిస్తూ అతను దూకాడు.
ఆ క్షణాల్లో ప్రపంచం శ్వాస ఆడక నిలిచిపోయింది. ఆయన భూమి వైపు గంటకు 690 మైళ్ల (1,110 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో పడి, మొదటిసారిగా మానవ శరీరం ధ్వని అవరోధాన్ని అధిగమించిన ఘనత సాధించాడు.
ఆ సమయంలో బామ్‌గార్ట్‌నర్ ఉత్సాహంతో క్యాప్సూల్ నుంచి బయటకు రాకముందు ‘థంబ్స్-అప్’ చూపించి తన ధైర్యాన్ని వ్యక్తపరిచాడు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పారాచూట్ యాక్టివేట్ చేసి సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. ఈ చరిత్రాత్మక సంఘటనను యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు.
మహత్తర గుర్తింపు
బామ్‌గార్ట్‌నర్ చేసిన ఈ జంప్ కేవలం సాహసక్రీడ మాత్రమే కాక, శాస్త్రీయంగా కూడా అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అత్యంత ఎత్తు నుంచి మానవ శరీరం పడే వేగం, గాలి ఒత్తిడి, ధ్వని అవరోధం ప్రభావం వంటి అంశాలపై కొత్త అధ్యయనాలకు మార్గం సుగమం చేశాడు. ఆయన ఈ సాహసంతో స్కైడైవింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
అనుమానాస్పద ఆరోగ్య సమస్య?
ఇటీవల జరిగిన ప్రమాదంపై ప్రాథమిక నివేదికల ప్రకారం, గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బామ్‌గార్ట్‌నర్‌కు ఏదో ఆరోగ్య సమస్య తలెత్తి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కారణంగానే ఆయన నియంత్రణ కోల్పోయి పారాగ్లైడర్ కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
చరిత్రలోని మరో ఘట్టం
ఫెలిక్స్ సాహసం 1947లో అమెరికన్ పైలట్ చక్ యేగర్ విమానం ద్వారా ధ్వని అవరోధాన్ని అధిగమించిన సంఘటన తర్వాత మరో మైలురాయిగా నిలిచింది. చక్ యేగర్ విమానంతో గంటకు 833 mph వేగాన్ని చేరుకోగా, బామ్‌గార్ట్‌నర్ స్వశరీరంతో అదే వేగాన్ని అధిగమించడం మానవ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.
ప్రపంచానికి స్ఫూర్తి
ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మరణం ప్రపంచ స్కైడైవింగ్ కమ్యూనిటీకి, సాహసక్రీడా అభిమానులకు తీరని లోటు. తన జీవితాన్ని సాహసాలకు అంకితం చేసిన ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు, ధర వివరాలీవే!